‘బాహుబలి 2’ దెబ్బ పవన్ కు తగిలినట్లే!

Katamarayudu-first-day-collectionsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కాటమరాయుడు’ సినిమా ఈ శుక్రవారం విడుదలై, ధియేటర్లలో సందడి చేస్తోంది. కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందనే దానిపై సమగ్ర సమాచారం తెలియాలంటే మరో రెండు రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. తొలి రోజు నాడు ఓపెనింగ్స్ బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోవడంతో బాక్సాఫీస్ వద్ద ‘కాటమరాయుడు’ ఏ మేరకు ప్రభావితం చేసాడో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సాధారణంగా పవన్ సినిమాలకు ఓపెనింగ్స్ డోకా లేకపోయినా, ‘కాటమరాయుడు’పై ఉన్న లో బజ్ ఓపెనింగ్స్ పై ప్రభావితం చూపినట్లుగా కనపడుతోంది.

నిజానికి తొలి రోజు కలెక్షన్స్ లో ఆల్ టైం రికార్డులు సృష్టిస్తుందని భావించినప్పటికీ, అది సాధ్యం కాలేదు. ఇక రెండవ రోజు నుండి డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. ‘కాటమరాయుడు’ స్పెషాలిటీ ఏమిటంటే… నెగటివ్ టాక్ పెద్దగా లేకుండానే డౌన్ ట్రెండ్ లోకి మారడం! ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే సినిమా పరిస్థితి ఏంటో పూర్తిగా తెలిసిపోయింది. దీంతో ఓపెనింగ్స్ తగ్గినా అందులో అర్ధముంది. కానీ, ‘కాటమరాయుడు’ టాక్ మరీ ‘సర్ధార్’ అంత అధ్వానంగా అయితే రాలేదు. అయినా గానీ కలెక్షన్స్ విషయంలో వెనుకపడడానికి కారణం ‘బాహుబలి 2’నే అని చెప్పకతప్పదు.

ADVERTISEMENT

“బాహుబలి 2” ట్రైలర్ విడుదలతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని మానసికంగా ఫిక్స్ అయిపోయారు. దీంతో ‘బాహుబలి 2’ను చూడబోతున్న కళ్ళకు ఈ రొటీన్ మాస్ మూస ‘కాటమరాయుడు’ మెప్పించలేకపోయాడు అనే టాక్ బలంగా వినపడుతోంది. ప్రస్తుతం అందరి చూపులు ఒక్క “బాహుబలి 2” వైపు తప్ప, మరే ఇతర సినిమాపై లేవన్నది, పవన్ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చెప్పకనే చెప్తున్నాయి. నిజానికి ఒక ‘యావరేజ్’ బొమ్మ పడితే పవన్, మహేష్ లాంటి హీరోలు వాటిని ‘బ్లాక్ బస్టర్’ స్థాయికి తీసుకెళ్ళగలరు. కానీ, పరిస్థితి అలా లేకపోవడం చూస్తుంటే… రాంగ్ టైంలో రిలీజ్ చేసారని సరిపెట్టుకోవాల్సిందే!

అయితే ‘బాహుబలి 2’ విడుదలయ్యే తేదీ ఏప్రిల్ 28వ తేదీ వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఇంతేనా? అంటే ‘ఇంతే’ అన్న టాకే ఎక్కువగా వినపడుతోంది. కానీ వచ్చే వారమే విక్టరీ వెంకటేష్ కూడా “గురు” రూపంలో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ‘గురు’ కూడా ‘రాయుడు’ బాటలో నడుస్తాడో లేక తెలుగు ప్రేక్షకులకు కాస్త కొత్తదనంతో ‘విక్టరీ’ని సొంతం చేసుకుంటాడో చూడాలి. అలాగే ఏప్రిల్ మొదటి, రెండు వారాల్లో కూడా కొన్ని ప్రముఖ చిన్న సినిమాల విడుదలలు ఉండడంతో, ఇవి ‘బాహుబలి 2’కు బలవుతాయో లేక అధిగమిస్తాయో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories