ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త చరిత్రకు ‘బాహుబలి 2’ నాంది పలికిందన్న విషయం పాతదే. మొదటి వారంలోనే “పీకే” ఆల్ టైం కలెక్షన్స్ ను దాటేసి నెంబర్ 1 సినిమాగా అవతరించింది. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కేవలం 6 రోజుల్లోనే దాదాపుగా 110 కోట్లు షేర్ కొల్లగొట్టి ‘బాహుబలి 2’ స్టామినా ఏంటో నిరూపించింది. నైజాం నుండి ఉత్తరాంధ్ర వరకు అన్ని ఏరియాలలోనూ ఆల్ టైం రికార్డులతో ప్రేక్షకులు స్వాగతం పలకడంతో పంపిణీదారులు పండగ చేసుకుంటున్నారు.
ఇండియన్ మూవీ మార్కెట్ పరిస్థితి ఇలా ఉంటే, ఓవర్సీస్ లో కూడా ఇప్పటికే ‘దంగల్’ రికార్డులను అధిగమించి, ఆల్ టైం నెంబర్ 1 ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అయితే, ఇక్కడితో ‘బాహుబలి 2’ ప్రస్థానం ముగియడం లేదు. ఏపీ, తెలంగాణాలలో కలిపి 100 కోట్లు కొల్లగొట్టడం కాదు, ఒక్క యుఎస్ మార్కెట్ లోనే ‘బాహుబలి 2’ 100 కోట్ల మార్కెట్ ను అవలీలగా అందుకోబోతోంది. దీంతో ఓవర్సీస్ లో ఫస్ట్ 100 క్రోర్స్ అందుకున్న సినిమాగా చరిత్రలో నిలిచిపోనుంది.
ఇప్పటివరకు దాదాపుగా 13 మిలియన్స్ అందుకున్న ఈ సినిమా ఈ వారాంతం నాటికి ఈ సంఖ్యను ఖచ్చితంగా 16-17 మిలియన్స్ డాలర్స్ కు పెంచుకోవడం తధ్యంగా కనపడుతోంది. వాటిని ఇండియన్ కరెన్సీలోకి తర్జమా చేస్తే… 100 కోట్లు పై మాటే. బహుశా మరే బాలీవుడ్ సినిమా కూడా సాధించని రికార్డులకు వేదికగా ‘బాహుబలి 2’ నిలుస్తుందేమో అన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఇండియన్ ట్రేడ్ పండితులు ఎదురుచూస్తున్న 1000 కోట్లు కూడా ఈ వారాంతంలో అధికారిక ప్రకటన రావచ్చని అంచనా వేస్తున్నారు.



