‘బాహుబలి – ది బిగినింగ్’ సినిమా ఎండ్ కార్డ్స్ లో ‘ది కన్ క్లూజన్’ సినిమా 2016లో విడుదల అవుతుంది అని దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణంగా రాజమౌళి ఏ విషయాన్ని ఖరారు చేయరు, కానీ జక్కన్న చెప్పారంటే ఆ మాటకు ఒక విలువ ఉంటుంది. అంతలా తన ప్రాధాన్యతను ప్రేక్షకుల్లో ఏర్పరచుకున్నారు జక్కన్న.
అలాంటి రాజమౌళి చెప్పిన ది కన్ క్లూజన్’ సినిమా 2016లో విడుదల కావడం లేదు. 2017, ఏప్రిల్ 14వ తేదీన ‘బాహుబలి 2’ విడుదల కానుందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరన్ ఆదర్ష్ ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సమాచారంతో జక్కన్న ఇచ్చిన మాట తప్పినట్లుగా ధృవీకరణ అయ్యింది. అయితే ఏడాది ముందుగానే పక్కా సమాచారం ఇవ్వడంతో ‘బాహుబలి 2’ షూటింగ్ పక్కా ప్లానింగ్ తో జరుగుతుందన్న సంకేతాలు సినీ ప్రేక్షకుల్లోకి పంపినట్లయ్యింది.
అయితే ‘బాహుబలి’ రెండు పార్టుల విడుదల తేదీలలో రాజమౌళి ఓక్ సెంటిమెంట్ ను పాటించారు. ‘బాహుబలి’ మొదటి పార్ట్ సినిమా విడుదల తేదీని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ద్వారా వెల్లడించిన రాజమౌళి, రెండవ పార్ట్ ను కూడా బాలీవుడ్ వర్గాలనే ఎంపిక చేసుకోవడం విశేషం. మరి రాజమౌళి నమ్మిన ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మరో 600 కోట్లు ‘బాహుబలి’ ఖాతాలో పడ్డట్లేనా..!





