ఏబీవీ కి బెజవాడ ఓటర్ల ‘కమ్మ’నైన తీర్పు…

ABV Vijayawada mayor election results

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విజయవాడ రాజకీయాలకు ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానమే ఉంటుంది. ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువ. తమ నాయకుడి ఎంపికలో బెజవాడ రాజకీయాలలో కుల సమీకరణలు ఎంత కీలక పాత్ర పోషించినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకునే ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

అయితే బెజవాడ రాజకీయం అంటే రెండు సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరు అనే భావనలోనే ఇంకా కొంతమంది నాయకులు ఉండిపోవడం, ఆ భావనను నమ్ముకునే ఎన్నికల బరిలోకి దిగి అనుకోని ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు మాజీ ఐపీఎస్ ఏబీ. వెంకటేశ్వరరావు.

ADVERTISEMENT

విజయవాడ మేయర్ అభ్యర్థిగా కూటమి నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధ జనసేన గుర్తుతో బరిలోకి దిగారు. అయితే వంగవీటి బ్రాండ్ కి ప్రత్యామ్నాయం గా వైసీపీ దేవినేని బ్రాండ్ ని రంగంలోకి దింపుతోంది అని అందరు ఉహించినప్పటికీ దేవినేని వెనక్కి తగ్గడంతో వైసీపీకి వేరేదారిలేక బీసీ సామాజికవర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మి ని బరిలోకి పంపారు.

దీనితో విజయవాడ రాజకీయంలో కీలక పాత్ర పోషించే ఆ రెండు సామాజికవర్గాల మధ్య రాజకీయ పోరు లేనట్టే అనుకున్న తరుణంలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో మాజీ ఐపీఎస్ ఏబీవీ రంగ ప్రవేశం చేసారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలోని కుల సమీకరణాలను తప్పుగా అర్ధం చేసుకుని పప్పులో కాలేశారనే చెప్పాలి.

కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి కాపు సామాజికవర్గం నేత రాధ బరిలోకి దిగితే బెజవాడ రాజకీయాలను శాసించగలిగిన కమ్మ సామాజికవర్గం ఓటర్లు తన వైపు నిలబడతారు అనే ఊహాజనితమైన ఆశతో ఏబీవీ బెజవాడ రాజకీయాలలోకి అడుగుపెట్టారు.

వంగవీటి బ్రాండ్ కి కమ్మ సామాజికవర్గం దూరమని, ఆ దూరాన్ని తానూ దగ్గర చేసుకోవాలని, చేసుకోగలనని ఆశపడిన ఏబీవీ కి విజయవాడ ఓటర్లు తమ ‘కమ్మ’నైన తీర్పు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన హక్కుల కోసం జగన్ తో యుద్ధం చేసిన ఏబీవీ ఇప్పుడు ఆ యుద్దాన్ని తన హక్కుగా సీఎం బాబు పైకి మళ్లించి రాజకీయంగా లబ్ది పొందాలనుకోవడం బెజవాడ ఓటర్ల ఆగ్రహానికి కారణమయ్యిందనే చర్చ నడుస్తుంది.

రాజకీయాలలో పార్టీ బలంతో పాటుగా ప్రజలతో క్షేత్ర స్థాయి సంబంధాలు కూడా ఎన్నికలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అనే కఠిన వాస్తవాన్ని ఏబీవీ విస్మరించారా.? వివాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకున్న పేరు ఎన్నికలలో గెలుపు కి మెట్లు కావు అనే నగ్న సత్యాన్ని నేటి ఎన్నికల ఫలితాలతో ఏబీవీ తెలుసుకున్నారా.?

కాపు అంటే కమ్మ సామాజివర్గానికి వ్యతిరేకం అనే దశాబ్దాల రాజకీయ చరిత్రను టీడీపీ, జనసేన తమ రాజకీయ పొత్తుతో తుడిచిపెట్టేసారు అనే వాస్తవాన్ని ఏబీవీ తో పాటుగా వైసీపీ కూడా గ్రహిస్తే మేలు. బెజవాడ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించే కమ్మ సామాజికవర్గం కేవలం కమ్మ అనే బ్రాండ్ నే పరిగణలోకి తీసుకోదు అనే చేదు నిజం నేటి రాధ గెలుపు నిరూపించింది.

కూటమి అభ్యర్థిగా జనసేన నేత వంగవీటి రాధ కు 2,65,888 ఓట్లు రాగ, వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి 1,35,016 ఓట్లు పోలవగా, స్వతంత్ర అభ్యర్థి ఏబీవీ కి 12,642 ఓట్లు సంపాదించుకున్నారు. దీనితో వంగవీటి రాధ తన సమీప ప్రత్యర్థి భాగ్యలక్ష్మి మీద 1,30,872 ఓట్ల మెజారిటీ తో విజయవాడ మేయర్ స్థానాన్ని దక్కించుకున్నారు. కేవలం సామాజికవర్గ లెక్కలనే బేరీజు వేసిన ఏబీవీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

ADVERTISEMENT
Latest Stories