జక్కన్న చెక్కిన అద్భుతం “బాహుబలి 2” విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి ప్రారంభమైన హంగామా 50 రోజుల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 1650 కోట్లు పైగా కొల్లగొట్టిన రికార్డును మరే ఇతర సినిమా అయినా దాటుతుందేమో గానీ, “బాహుబలి 2” నమోదు చేసిన 50 రోజుల సెంటర్స్ ను మాత్రం మరే ఇతర సినిమా దాటలేని విధంగా రికార్డులను సెట్ చేసింది.
ఇండియా వ్యాప్తంగా దాదాపుగా 1050 సెంటర్లలో “బాహుబలి 2” 50 రోజులను పూర్తి చేసుకుంది. నిజానికి ప్రస్తుతం ఈ సెంటర్స్ రికార్డుల గోల లేనప్పటికీ, ‘బాహుబలి 2’ సాధించిన అపూర్వ విజయంతో ఈ రికార్డులు కూడా వచ్చి పడ్డాయి. మున్ముందు 2000 కోట్లు కొట్టే సినిమా అయినా ఈ రికార్డును అందిపుచ్చుకోవడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. దీంతో ఏ పాత రికార్డును వదిలిపెట్టబోనని ‘బాహుబలి’ స్పష్టంగా చెప్పినట్లే.
బాలీవుడ్ సినిమాలకు 50 డేస్ పోస్టర్ అన్న విషయం మరిచిపోయి చాలా సంవత్సరాలైంది. కానీ ‘బాహుబలి 2’ మాత్రం బాలీవుడ్ లో కూడా రికార్డు సెంటర్స్ లో 50 రోజుల పర్వదినం జరుపుకుంటోంది. తెలుగు నాట ఈ సంఖ్య 282గా ఉండగా, తమిళనాడు, కేరళలలో కూడా ఘనవిజయాన్ని అందిపుచ్చుకుని… ఓవరాల్ గా ఆల్ ఇండియా రికార్డును సెట్ చేసింది. మళ్ళీ దీనిని కొట్టాలంటే… రాజమౌళి ‘మహాభారతం’ సృష్టించాలేమో..!



