భారీ అంచనాలతో ఏప్రిల్ 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న “బాహుబలి 2” కోసం అశేష సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి తగిన విధంగానే సినిమాకు పబ్లిసిటీని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అందరూ నిరీక్షిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మార్చి 2వ వారంలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుండగా, ఈ సినిమా ఆడియో వేడుకను మార్చి 4వ వారంలో విడుదల చేయడానికి సర్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది.
అనధికారిక సమాచారం ప్రకారం… మార్చి 26వ తేదీన అంగరంగ వైభవంగా “బాహుబలి – ది కన్ క్లూజన్” ఆడియో విడుదల కానుంది. ‘బాహుబలి’ ఆడియోను తిరుపతిలో విడుదల చేయగా, తాజాగా మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో గానీ, అన్నపూర్ణ స్టూడియోస్ లో గానీ విడుదల చేయాలని సంకల్పించినట్లుగా తెలుస్తోంది. అయితే ఒకేసారి అన్ని భాషల ఆడియోలను విడుదల చేస్తారా? లేక విడివిడిగా విడుదల చేస్తారా? అన్న విషయం తెలియాల్సి ఉంది.



