ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు యుఎస్, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలలోనూ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న “బాహుబలి 2” చైనా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. గతేడాది అమీర్ ఖాన్ “దంగల్” కనివినీ ఎరుగని విజయం సాధించడంతో, ‘బాహుబలి 2’ కూడా అలాంటి విజయాన్ని నమోదు చేస్తుందేమోనని ట్రేడ్ పండితులు అంచనాలు వేసారు. చైనా మార్కెట్ లోని కలెక్షన్స్ పై ‘బాహుబలి’ యూనిట్ కూడా భారీ ఆశలనే పెట్టుకుంది.
అయితే అవన్నీ నీరుగారిపోయాయి. ‘బాహుబలి 2’ చిత్రాన్ని చైనా వాసులు ఆశించిన రీతిలో ఆదరించలేదన్న క్లారిటీ వచ్చేసింది. నిజానికి ‘బాహుబలి 1’ కూడా చైనాలో ఏ మాత్రం ప్రభావితం చూపలేదు. ఇదే సమయంలో ‘దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, బజరంగీ భాయిజన్’ వంటి సినిమాలు చైనాలో అద్వితీయ విజయాలు నమోదు చేసుకున్నాయి. ‘బాహుబలి’ వంటి ఫాంటసీ సినిమాలైతే వాళ్ళే గొప్పగా తీసుకుంటారు కాబట్టి, కంటెంట్ ఉన్న సినిమాలకే చైనా వాసులు పట్టం కడుతున్నట్లుగా స్పష్టమవుతోంది.



