సుప్రీంకోర్టులో శ్రీమంతుడు… పోలీస్ స్టేషన్‌లో బేబీ!

Baby Movie

తెలుగు సినీ పరిశ్రమలోకి దూసుకువస్తున్న యువ దర్శకులు, రచయితలు, నటీనటులు సరికొత్త ఆలోచనలు, కధలతో సినిమాలు తీస్తూ అందరినీ అలరిస్తుంటే కొందరు స్టార్‌ దర్శకులు నిర్మాతలతో వందల కోట్లు ఖర్చు పెట్టించి మూస కధలతో ఏళ్ళ తరబడి సినిమా తీసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. కానీ ప్రేక్షకులు చిన్నా పెద్దా అని చూడకుండా వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు.

మూస కధలు తీసుకుని బోర్లాపడితే జాలి పడొచ్చు. కానీ ఎవరో వ్రాసుకున్న కధలను స్టార్ దర్శకులే కాపీలు కొట్టి సినిమాలు తీస్తేనే భరించడం కష్టం.

ADVERTISEMENT

కొరటాల శివ-మహేష్‌ బాబు ‘శ్రీమంతుడు’ సినిమా కాపీరైట్ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దర్శకుడు కొరటాల ‘క్రిమినల్ చర్యలకు అర్హుడే’ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. బహుశః తెర వెనక, కోర్టు బయట రాజీ ప్రయత్నాలు జరుగుతుండవచ్చు. కనుక ఏదోరోజూ నిశబ్ధంగా ఆ కేసు ముగిసినా ఆశ్చర్యపడక్కరలేదు.

శ్రీమంతుడు కేసు క్లైమాక్స్ చేరుకొన్న సమయంలోనే మరో ‘బేబీ’ పుట్టింది!

గత ఏడాది జూలై 14న రిలీజ్ అయిన సూపర్ హిట్ ‘బేబీ’ సినిమా కూడా కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. సాయిరాజేష్ నీలం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించారు.

కేవలం పది కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిన్న సినిమా రూ.70 కోట్ల కలెక్షన్స్ సాదించి నిర్మాతలు గోవర్ధన్ మారుతి, శ్రీనివాస కుమార్‌ నాయుడులకు కనకవర్షం కురిపించింది. ఆ తర్వాత ఆహా ఓటీటీలో విడుదలై అక్కడా మంచి రేటింగ్ సాధించింది.

ఓ విభిన్నమైన ముక్కోణపు ప్రేమ కధని ఇంత చక్కగా తెరకెక్కించినందుకు దర్శకుడు సాయి రాజేష్ కు ఇండస్ట్రీలో మంచిపేరు వచ్చింది. కానీ అది నేను వ్రాసుకున్న‘కన్నా ప్లీజ్’ అనే కధకు కాపీ అంటూ షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ శిరీన్ శ్రీరామ్ శుక్రవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తనకు 2013లో దర్శకుడు సాయిరాజేష్ నీలంతో పరిచయం అయ్యిందని, ఆ తర్వాత 2015లో తాను వ్రాసుకున్న కధ పేరుని ‘ప్రేమించొద్దు’గా మార్చి ‘బేబీ’ నిర్మాతలకు వినిపించానని, దానినే వారు కాపీ కొట్టి బేబీ సినిమాగా తీసి 2023లో విడుదల చేశారని శిరీన్ శ్రీరామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీమంతుడు సుప్రీంకోర్టులో తేలాడు మరి ఈ బేబీ ఎక్కడ తేలుతుందో?

ADVERTISEMENT
Latest Stories