‘బాహుబలి’ సినిమా విడుదలైన నాటి నుండి తనను ఎవరూ పేరు పెట్టి పిలవడం లేదని, అంతా ‘బాహుబలి… బాహుబలి…’ అంటున్నారని, ఈ సినిమాలో ప్రభాస్ చిన్న పిల్లాడి పాత్రను పోషించిన బాల నటుడు దేవాదుల నిఖిలేశ్ అభిప్రాయపడ్డారు. విశాఖ పట్ణణంలో జరుగుతున్న బాలల జాతీయ చలన చిత్రోత్సవంలో నిఖిలేశ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొనగా… ఇప్పటివరకు ‘బాహుబలి’, ఉయ్యాల జంపాల, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, గరం’ వంటి మొత్తం 15 సినిమాల్లో నటించానని తెలిపాడు.
అయితే అన్నింటికంటే మిన్నగా ‘బాహుబలి’ చిత్రంతో మంచి పేరొచ్చిందని, ఈ నెలాఖరున విడుదల కాబోయే ‘బాహుబలి-2’లో కూడా తాను నటించానని తెలిపాడు. రాజమౌళి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు చేస్తున్న ‘శ్రీవల్లి’ అనే మూవీలో ముందుగా నేను సెలెక్టు కాగా, కొన్ని కారణాల వలన ఆ చిత్రం ఆగిపోయింది. దీంతో కొన్నాళ్ళ తర్వాత నేను మళ్లీ ఆయన దగ్గరకు వెళ్ళగా, అప్పటికి కొంచెం పెద్దవాడిని అయిపోవడంతో ఆ సినిమాలో నటించడం కుదరలేదు.
అప్పుడు, విజయేంద్రప్రసాద్ గారు రాజమౌళి గారికి ఫోన్ చేయడంతో… ‘బాహుబలి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావడంతో ముందు తాను షాక్ కు గురయ్యానని, నటించింది చిన్న పాత్రలోనే అయినా, మంచి గుర్తింపు లభించిందని, చాలా సంతోషంగా ఉందని తన అనుభూతులను పంచుకున్నాడు నిఖిలేశ్. ప్రస్తుతం ‘బాబు బాగా బిజీ, ‘అంతా నీ ఇష్టం’ అనే చిత్రాల్లో నటిస్తున్నానని, భవిష్యత్తులో హీరో అవ్వాలని అనుకుంటున్నానని, అవుతాను పక్కా… అంటూ మిక్కిలి ఆనందంతో చెప్పుకొచ్చాడు.



