నాకు ఎవరూ పోటీ లేరు! ఉంటే నా కొడుకు, మనవడే : బాలయ్య!

balakrishna jr ntr controversy clarityనందమూరి నటసింహం బాలకృష్ణ తేల్చేసారు..! సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ లేకుండా “డిక్టేటర్” ప్లాటినం డిస్క్ వేడుకలు ఎందుకు జరిగాయో “నందమూరి” అభిమానులందరికీ ఇప్పటికే అర్ధమైపోయుంటుంది. అవును… “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుకపై సుదీర్ఘ ప్రసంగం చేస్తూ… ‘స్వర్గీయ ఎన్టీఆర్ స్వయంగా ఆశీర్వదించి తన మనవడికి తన పేరే పెట్టారని, ఆయన వారసత్వాన్ని కొనసాగించేది జూనియర్ ఎన్టీఆర్ అని” పరోక్షంగా హరికృష్ణ చేసిన వ్యాఖ్యలకు… అదే స్థాయిలో బాలకృష్ణ బదులిచ్చారు.

యాంకర్ ఝాన్సీ చేసిన “వారసత్వం”తో ప్రారంభమైన ఈ వేడుక ఆద్యంతం ‘ఎన్టీఆర్’ తర్వాత ‘బాలయ్య’ మాత్రమే అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇక, మైక్ తీసుకున్న బాలకృష్ణ… నందమూరి అభిమానుల మదిలో దాగి వున్న సందేహాలు నివృత్తి చేసే విధంగా స్పష్టమైన ప్రకటన చేసేసారు. బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఇటు అభిమానులు, అటు ఆహ్వానితులు చప్పట్లు, ఈలలతో ప్రాంగణాన్ని మారుమ్రోగించారు.

ADVERTISEMENT

ఇంతకీ బాలయ్య చేసిన ఆ ప్రకటన ఏమిటంటే… “నాకు ఎవరూ పోటీ లేరు, కారు! నాకు ఉన్న పోటీ అంటే అది నా అబ్బాయి, నా మనవడే! నాకు ఇంకెవరూ లేరు పోటీ” అని చెప్పగానే వేడుక అంతా దద్దరిల్లింది. నిజానికి ఈ వ్యాఖ్యల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. అందుకే బాలకృష్ణ అలా చెప్పగానే దర్శకుడు శ్రీవాస్, హీరోయిన్ అంజలితో సహా అందరూ ప్రతిస్పందించారు. బాలయ్య ఇంత సింపుల్ గా చెప్పినా వీటిని నందమూరి అభిమానులు ఎంత సీరియస్ గా తీసుకుంటారనేది రానున్న నాలుగైదు రోజుల్లోనే తేలిపోనుంది.

అలాగే బాలయ్య సినిమాలో చెప్పిన డైలాగ్ ను స్టేజ్ పైన కూడా పలికారు. “నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తావ్… నేనేం చేసినా పబ్లిసిటీ అవుతుంది…” అన్న డైలాగ్ కూడా ఎవరికి తగాలలో వారికే తగిలిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ వేడుకలో వినిపించిన మరో డైలాగ్ “వాడెవడు… వీడెవడు… బాలయ్యకు ఎదురెవ్వడు…” అన్న డైలాగ్ ను అభిమానులు విస్తృతంగా వాడేస్తున్నారు. ఈ వేడుక నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

ADVERTISEMENT
Latest Stories