ఈ దసరాకు “పైసా వసూల్” ద్వారా అభిమానుల సరదా తీర్చేయాలని ముచ్చట పడుతోన్న నందమూరి నటసింహం, తన తదుపరి చిత్రాన్ని ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ తో సినిమాలు తీసినటువంటి ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 102వ సినిమా నటిస్తుండగా, తాజాగా తన తదుపరి సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.
తన 103, 104 సినిమాలు ఎవరితో ఉంటాయో ఇప్పుడే చెప్పలేను గానీ, తాను నటించే 105వ చిత్రం మాత్రం భారీ మల్టీస్టారర్ చిత్రమని ఖరారు చేసారు బాలకృష్ణ. దీంతో ఆ భారీ మల్టీస్టారర్ ఏమై ఉంటుందా? అన్న ఊహాగానాలు ట్రేడ్ వర్గాలలో చెలరేగుతున్నాయి. తెలుగులో అగ్ర హీరోల మల్టీస్టారర్ సినిమాలకు సినీ ప్రేక్షకులకు మొహంవాచేలా ఎదురుచూస్తున్న వైనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!
అయితే ‘భారీ మల్టీస్టారర్’ అంటూ ఊరించారు గానీ, దానికి సంబంధించిన ఒక్క విషయం కూడా బయటకు రాలేదు. మరి నిజంగానే ప్రేక్షకుల కలలు సాకారం అయ్యేలా తన మల్టీస్టారర్ సినిమాను సిద్ధం చేస్తారా? అందులోనూ రాబోయే రెండు సంవత్సరాలు ఎన్నికల సమయం కావడంతో… బాలయ్య 105వ సినిమా కార్యరూపం ఎప్పటికి సిద్ధిస్తుందోనని ఆలోచించుకోవడం నందమూరి అభిమానుల వంతవుతోంది.


