వైసీపీ పార్టీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ పార్టీ క్యాడర్ కు కూడా అర్ధం కానీ రీతిలో ముందుకెళుతోంది. ఒక పక్క వైసీపీ పార్టీ కి రాజీనామాలు చేస్తూ చిన్న శీను, యనమల కృష్ణుడు వంటి వారు టీడీపీ, జనసేన వైపు వెళుతున్న నేపథ్యంలో వైసీపీ క్యాడర్ తలలు పట్టుకుంటుంటే,
మరోపక్క వైసీపీ నుంచి జనసేన కు వచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు తిరిగి బ్యాక్ టూ హోమ్ అంటూ వార్తలు ఊపందుకోవడంతో ఆ పార్టీ క్యాడర్ అయోమయంలోకి వెళుతుంది. నాడు జగన్ ని కాదని పవన్ కి జై కొట్టి నేడు తిరిగి పవన్ కాదని జగన్ కు జై కొడితే బాలినేని ని వైసీపీ క్యాడర్ అక్కున చేర్చుకుంటుందా.?
వైసీపీ ఘోర ఓటమి తరువాత వైసీపీ కి విడాకులిచ్చి జనసేన అధినేత పవన్ సమక్షంలో గాజు గ్లాసుతో తాంబూలం కుదుర్చుకున్న బాలినేని కూటమి పొత్తులో ఇమడలేకపోతున్నారు అనే వార్త కథనాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. వాటికీ బలం చేకురేలా బాలినేని ఎంట్రీ తరువాత కూటమి ఒంగోలు రాజకీయం హీట్ ఎక్కింది.
బాలినేని జనసేన ఎంట్రీ ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామిచర్ల జనార్దన రావు. గత కొన్నేళ్లుగా ఒంగోలు రాజకీయాలలో ఈ ఇరువురు నేతలు రాజకీయ ప్రత్యర్థులుగా నువ్వా – నేనా అన్నట్టుగా పోటాపోటీ యుద్దాలు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బాలినేని వైసీపీ కి గుడ్ బై చెప్పి జనసేన తీర్ధం పుచ్చుకుని కూటమి లో భాగమైనప్పటికీ స్థానిక టీడీపీ నాయకులు కానీ క్యాడర్ కానీ బాలినేని ని కూటమిలోకి ఆహ్వానించలేకపోతుంది. దానికి తోడు తాజాగా బాలినేని సైతం దామిచర్ల జనార్ధన రావు పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ, టీడీపీ క్యాడర్ ని మరింత రెచ్చకొట్టారు.
దీనితో ఈ రెండు వర్గాల మధ్య రాజకీయ సవాళ్లు టీడీపీ – జనసేన మధ్య రాజకీయ బంధానికి సంక్లిష్టంగా మార్చాయి. దీనితో కూటమి పొత్తుకు విఘాతం కలిగించేలా ఏ పార్టీ నేతలు ఒకరిపై మరొకరు బహిరంగ విమర్శలు చేసినా చర్యలు తప్పవంటూ ఇరుపార్టీల అధిష్టానాలు ప్రకటనలు జారీ చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.
అయితే బాలినేని వైసీపీ పార్టీ అయితే మారగలిగారు కానీ జనసేన పార్టీ భావజాలాన్ని మాత్రం అనుసరించలేకపోతున్నారని, మనిషి ఇక్కడ, మనసు అక్కడ అన్నట్టుగా బాలినేని వ్యవహారం ఉంటుందంటూ సోషల్ మీడియాలో భిన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం బాలినేనిని పార్టీకి ఆహ్వానించినప్పటికీ తన సీనియారిటీకి తగ్గ గౌరవప్రదమైన స్తానం కల్పించలేదని, పార్టీ అంతర్గత వ్యవహారాలలో కూడా బాలినేనికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, జనసేన కండువా కప్పుకుని ఇన్ని రోజులు గడుస్తున్నా పార్టీలో బాలినేని స్థానం ఏంటనేది ఇప్పటికి సమాధానం లేని ఒక చిక్కు ప్రశ్నగానే ఉండడం తో బాలినేని తిరిగి బ్యాక్ టూ హోమ్(ycp) లో చేరేందుకు మంతనాలు మొదలుపెటినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.
వైసీపీ పార్టీ మార్పుకు గల కారణాలు, ఆ తరువాత జరిగిన పరిణామాలు క్షుణ్ణంగా జగన్ కు విశదీకరించి తిరిగి ఆయన అనుమతితో వైసీపీ నేతగా కొనసాగాలని బాలినేని ఎదురుచూస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఊహాగానాలే వాస్తవ రూపంలోకి వస్తే అసలు బాలినేని వైసీపీ ఎగ్జిట్ కి జనసేన ఎంట్రీ మధ్య ఉన్న రాజకీయం అత్యంత కీలకం కానుంది.







