తమిళ దర్శకుడన్న నమ్మకమో… ఇప్పటివరకు విడుదలైన టీజర్ల ప్రభావమో గానీ… ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “స్పైడర్” సినిమా కంటే, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న “భరత్ అనే నేను” సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఎక్కువ బజ్ ఉంది. అవును… తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించిన “స్పైడర్” సినిమాపై తొలినాళ్ళల్లో భారీ అంచనాలు నెలకొన్న మాట వాస్తవమే గానీ, వాయిదాల పర్వంలో ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. ఇక టీజర్లు విడుదలైన తర్వాత పూర్తిగా పడిపోయింది.
మరోవైపు ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన “భరత్ అనే నేను” సినిమాపై ఇటు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలోనే కాదు, బాలీవుడ్ లోనూ ఆసక్తి రేపడం విశేషం. ఈ సినిమా హిందీ హక్కులను దాదాపుగా 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న విషయం. ఒక తెలుగు సినిమాకు ఈ స్థాయిలో లభించడం ఊహించిన పరిణామం కాదు. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న ‘స్పైడర్’ను పక్కన పెట్టి, మరో నాలుగు నెలల సమయం ఉన్న ‘భరత్ అనే నేను’ దృష్టి పెట్టడం అనేది, ‘స్పైడర్’పై ఎలాంటి సంకేతాలను పంపిస్తున్నట్లు?
బహుశా సెప్టెంబర్ 9వ తేదీతో ‘స్పైడర్’పై ఓ అవగాహన వచ్చే స్పష్టంగా కనపడుతోంది. ఆ రోజున చిత్ర యూనిట్ ధియేటిరికల్ ట్రైలర్ విడుదల చేయనుండడంతో, “స్పైడర్” సినిమాపై నమ్మకాలు పెట్టుకోవాలా? లేదా? అనే విషయంపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు, ట్రేడ్ వర్గాలకు ఓ స్పష్టత వచ్చేస్తుంది. ప్రిన్స్ కెరీర్ లో తమిళ దర్శకుడు ఎస్.జే.సూర్యతో చేసిన ఏకైక సినిమా “నాని” తర్వాత చేస్తున్న “స్పైడర్” ఫలితాన్ని బట్టే, మహేష్ మరోసారి తమిళ దర్శకులతో చేస్తారా? లేదా? అన్నది డిసైడ్ అవుతుంది.


