
తెలంగాణ రాజకీయాలలో బీజేపీ పాత్ర ఏమిటి అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు టి. బీజేపీ వద్ద కూడా సమాధానం దొరకదేమో. ఒకసారి అధికారం కోసమే అంటూ దూకుడు రాజకీయాలు చేస్తుంది టి.బీజేపీ, మరోసారి రాష్ట్రంలో రెండవ స్థానంలోకి బీజేపీ అంటూ ప్రకటనలు చేస్తూ ఆ దిశగా రాజకీయం సాగిస్తుంది.
మరికొన్ని సార్లు అసలు తెలంగాణ రాజకీయాలలో బీజేపీ ఉందా లేదా అన్నట్టుగా స్తబ్దుగా అజ్ఞాతంలో రాజకీయం నడుపుతుంది. అయితే అసలు వాస్తవానికొస్తే బీజేపీ కి తెలంగాణలో సొంతగా అధికారంలోకి వచ్చే సత్తా ఉందా.? కనీసం బీజేపీ తన సొంత బలంతో తెలంగాణలో ప్రతిపక్షానికైనా రాగలదా.?
ఒక్క తెలంగాణలోనే కాదు అటు ఏపీలో కానీ ఇటు తమిళనాడులో కానీ బీజేపీ కి సొంత బలం శూన్యమని ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా తెలుసు. అందుకే ఏపీలో బీజేపీ టీడీపీ, జనసేన కూటమి తో చేతులు కలిపి ప్రభుత్వంలో భాగమయ్యింది.
ఇక తమిళనాడులో అన్న డీఎంకే పార్టీ తో పొత్తు పెట్టుకుని కనీసం ప్రతిపక్షంలో అయినా భాగం కావాలని ఆశపడుతోంది. కానీ తెలంగాణలో మాత్రం టి. బీజేపీ నేతలు మాకు ఏ పార్టీతో పొత్తు లేదు, ఆ అవసరం రాదు అంటూ మొండిగా ఒకరకముగా చెప్పాలంటే మూర్ఖంగా ముందుకెళ్తున్నారు, పార్టీ పరువు తీసుకుంటున్నారు.
తెలంగాణలో కూడా ఏపీలో మాదిరి బీజేపీ – టీడీపీ, జనసేనలతో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంది. అయినా అందుకు టి. బీజేపీ నేతలు సుముఖత చూపడం లేదు. అలాగే బీజేపీ, బిఆర్ఎస్ ల ఉమ్మడి రాజకీయ శత్రువైన కాంగ్రెస్ తో పోరాడేందుకు టి. బీజేపీ, బిఆర్ఎస్ తో కూడా కలిసి ముందుకెళ్లొచ్చు, కానీ ఆ విషయంలో బీజేపీ ఇప్పటికి సంకోచిస్తూనే ఉంది.
అటు బిఆర్ఎస్ సైతం బీజేపీ విషయంలో ముందుకెళ్లలేక వెనక్కిపోలేక ఎప్పటికప్పుడు తన పార్టీ శ్రేణుల ముందు మనది ఒంటరి పోరాటమే అంటూ ప్రకటించుకోవాల్సి వస్తుంది. అటు బీజేపీ ది కూడా ఇదే పరిస్థితి. మేము ఎవరితోనూ పొత్తులో లేము, మాకు ఎవరి పార్టీతో రాజకీయ పొత్తు అవసరం లేదు అంటూ టి.బీబీజేపీ నేతలు సైతం పదేపదే తమ పార్టీ శ్రేణులకు బహిరంగ ప్రకటలు చేస్తున్నారు.
అయితే రాజకీయాలలో పార్టీల మధ్య పొత్తులు అనేవి సర్వ సాధారణమైన అంశమే. ఏపీలో 2024 ఎన్నికలకు ముందు వరకు కూడా టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు ఉండదంటూ ఏపీ బీజేపీ నేతలు పదేపదే వ్యాఖ్యానించారు. కట్ చేస్తే బీజేపీ ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగమయ్యింది, అలాగే కేంద్రంలో ఎన్డీయే హ్యాట్రిక్ కు ఏపీలో పొత్తు బీజేపీకి అత్యంత కీలకమయ్యింది.
ఇప్పుడు ఒకపక్క బీజేపీ మరోపక్క బిఆర్ఎస్ మా రెండు పార్టీల మధ్య పొత్తులు లేవు భవిష్యత్ లో ఉండబోవు అంటూ ఒకరికొకరు పోటీ పడి మరి ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. మరి రేపు రాబోయే ఎన్నికల వరకు ఈ రెండు పార్టీలు తమ ప్రకటనల మీద నిలబడి ఉండగలవా.? లేదా రాజకీయ నాయకుల ప్రకటనలకు అర్ధాలు వేరులే అంటూ రేపటి రోజున రెండు పార్టీల నేతలు దోస్తీ మేర దోస్త్ అంటూ కాషాయ కారులో ప్రయాణం చేస్తారా.?
Suryakumar Yadav’s career has taken another unexpected turn. After being left out of all three…
అభివృద్ధి గురించి ఆలోచించాలంటే అమరావతి, పోలవరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు,…