తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 ఇంకా మొదలు కాకముందే వార్తలలో నిలుస్తుంది ఈ షో గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి హోస్ట్ ఎవరనే ప్రశ్నలకు తెరతీస్తూ నాగార్జున అని కన్ఫర్మ్ చేసారు. ఈ మద్యే విడుదలైన ప్రోమో కూడా దుమ్ము దులిపేస్తుంది. ఇక ఇప్పుడు అందరి ఆసక్తి కంటెస్టెంట్లపై ఉంది. ఈ సారి హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్ ఇప్పటికే అనేక పేర్లు బయటకు వచ్చాయి. అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటివరకూ కంటెస్టెంట్స్ ఫైనల్ కాలేదు.
షో కోసం నలభై మందిని సెలెక్ట్ చేసి ఉంచారు. ఇంకో వారంలో చివరి 14 మంది ఫైనల్ అవుతారు. టీవీ యాంకర్ శ్రీముఖి మాత్రం కంఫర్మ్ అని తెలుస్తుంది. మరోవైపు బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ నెల 21 నుండి షో టెలికాస్ట్ ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. 100 రోజుల పాటు జరగబోయే ఈ షోపై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. మొదటి రెండు సీజన్‌లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు.
తమిళ, హిందీ బిగ్ బాస్ షోలకు అన్ని సీజన్‌లకు ఒకే హోస్ట్ ఉండగా తెలుగుకు మాత్రం మూడు సీజన్‌లకు ముగ్గురు అయ్యారు ఇప్పటికి. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళ్ లో కమల్ హస్సన్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్, నానిలకు ఇంతకు ముందు టీవీలో చేసిన అనుభవం లేకపోగా… నాగార్జున మాత్రం ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను హోస్ట్ చేసి సక్సెస్ ఫుల్ అనిపించుకున్నారు. మరి ఆయన బిగ్ బాస్ లో చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.



