రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత కూడా తీస్తూనే ఉంటారు. అవి అంతగా స్పూర్తి కలిగిస్తాయి. వాటిని ప్రజలు చూసి ఆదరిస్తూనే ఉంటారు.
అంతగా స్పూర్తి కలిగిస్తున్న ఆ గాధలతో తీస్తున్న సినిమాలలో అధిక శాతం ‘సూపర్ హిట్స్’గా నిలుస్తున్నాయి. కానీ అవే గాధలతో తీసిన కొన్ని సినిమాలను మాత్రం ప్రజలు తిరస్కరిస్తున్నారు. కారణం ఏమిటి?అని దర్శక నిర్మాతలు ఆలోచించి ఉంటే, వాటి నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోగలిగేవారు.
కానీ అందుబాటులోకి వచ్చిన గ్రాఫిక్స్, ఏఐ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఊహాతీతంగా తీసి మెప్పించవచ్చనే భ్రమలో వందలు, వేలకోట్ల బడ్జెట్తో పౌరాణిక సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నారు. ఇప్పుడు వాటి గురించి చర్చ అనవసరం.
ఈ దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 5న విడుదలవుతున్న ‘రామాయణ’ గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవడం అవసరం.
నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ నుంచి ఇటీవల దసరా పండుగ సందర్భంగా ‘రైజ్ ఆఫ్ అసుర’ పేరుతో రావణుడి ‘శివతాండవం’ వీడియో విడుదల చేశారు.
శివతాండవం అంటే కేవలం రౌద్ర రసం మాత్రమే కనిపించాలి. శివుడు లేదా ఆ నృత్యం చేస్తున్న రావణుడు మాత్రమే కనిపించాలి. కానీ ‘గ్రాఫిక్స్’ ఎక్కువగా కనిపించాయి.
అవి చాలా గ్రాండ్గా అద్భుతంగా ఉన్నాయి కానీ ‘శివతాండవం’ నుంచి ప్రేక్షకులు ఆశించిన అనుభూతి లభించదు. కనుక ప్రేక్షకులు అక్కడ సినిమాతో ‘డిస్ కనెక్ట్’ అవుతారు.
నేడు ‘రంగులు రంగులే..’ అంటూ సాగే ఓ పాట విడుదల చేశారు. శివతాండవంలో ‘మిస్’ అయిన అనుభూతి ఈ పాటలో చాలాసార్లు కలుగుతుంది.
ఉదాహరణకు సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సు వద్దకు వస్తుంటే, సీతమ్మవారు చేతులు జోడించి మనసులో ప్రార్ధించడం, శ్రీరాముడు కూడా శివధనుస్సు ఎత్తలేకపోతాడేమోననే కొద్దిగా ఆందోళన, కానీ శ్రీరాముడు ధనుస్సు ఎత్తి సందించబోతుంటే సీతమ్మ మొహంలో సంతోషంతో వెలిగిపోవడం.. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి కలిగిస్తాయి.
అలాగే సీతారాముల పెళ్ళిలో సీతమ్మ భక్తితో చేతులు జోడించడం, శ్రీరాముడు నుదుట కుంకుమ బొట్టు పెడుతుంటే భక్తితో చేతులు జోడించి బొట్టు పెట్టించుకోవడం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఈ రెండు సన్నివేశాలలో రణబీర్ కపూర్, సాయి పల్లవిలను కాకుండా ప్రేక్షకులు సీతారాములను మాత్రమే చూస్తారు.
ప్రేక్షకులకు ఇలాంటి గొప్ప అనుభూతి కలిగించ గలిగినప్పుడే సినిమాను ఆదరిస్తారు. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సరే!
అలాగని ఒళ్ళు గగుర్పొడిచే యుద్ధ సన్నివేశాలను, భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ ఆస్వాదించరని కాదు. కానీ అవి కరుణ, భక్తి, ఆధ్యాత్మికత వంటి అనుభూతులను మింగేయకూడదు.
ఈ సినిమాలో ‘శివతాండవం’ అదే జరిగింది కానీ నేడు విడుదల చేసిన ‘రంగులు రంగులే’ పాటలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులు కోరుకున్న ఆ అనుభూతి కలిగిస్తాయి.
వేలకోట్లతో తీసిన ‘రామాయణ’ దేశ ప్రజలు కోరుకున్న ఆ అనుభూతిని అందిస్తుందనే ఆశిద్దాం.





