
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు మిగిలిన రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయంటూ మూడు స్తంభాలాట ఆడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు చాలా ప్రయత్నించాయి. కానీ తెలంగాణ ప్రజలు అవి అనుకొన్నంత అమాయకులు కారు. అందుకే కేసీఆర్‌ని గద్దె దించి ఇంటికి పంపించి, రేవంత్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.
పార్టీలు విశ్వసనీయతని పణంగా పెట్టి రాజకీయాలు చేస్తే సహించబోమని ప్రజలు స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా మూడు పార్టీలు మీ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయంటే… కాదు మీరే కుమక్కు అయ్యారని ఆరోపిస్తున్నాయి.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఎంతో గొప్పగా చెప్పుకొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీ రెండూ గట్టిగా వాదిస్తున్నాయి. దానిలో భాగమైన మేడిగడ్డ బ్యారేజిలో మూడు పియర్స్ క్రుంగడంతో బిఆర్ఎస్ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. అందుకే కేసీఆర్ దీని గురించి ఏమీ మాట్లాడటం లేదని ఆరోపిస్తున్నాయి.
అయితే కేవలం ఐదుగురు ఎమ్మెల్యేల అదనపు బలంతో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా మనుగడ సాగించేందుకు కేసీఆర్ మద్దతు, సహాయసహకారాలు కావాలి కనుక ఆయనను, బిఆర్ఎస్ నేతలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టింగ్ చేత విచారణ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ నేతలు సవాలు విసురుతున్నారు.
ఈ ఆరోపణలపై తెలంగాణ సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ,”బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య ఉన్న రహస్య అవగాహన గురించి అందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవని, కేసీఆర్ కుటుంబం ఆ ప్రాజెక్టుని ఏటిఎం మెషీన్‌లా వాడుకొంటూ నిలువునా దోచేసుకొంటోందని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు స్వయంగా ఆరోపించారు. అయినా కేసీఆర్‌పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు?
పైగా నిబందనలన్నీ సడలించి కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు, అప్పులు ఎందుకు మంజూరు చేశారు? అంటే బీజేపీ, బిఆర్ఎస్ మద్య రహస్య అవగాహన ఉందనే కదా? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత హ్యాండ్ ఉందని ఈడీ స్వయంగా చెపుతున్నా ఇంతవరకు ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే బీజేపీ, బిఆర్ఎస్‌ల మద్య రహస్య అవగాహన ఉన్నందునే కదా?
కేసీఆర్ కుటుంబం అవినీతిని వెలికి తీసేందుకు మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయవిచారణకు ఆదేశిస్తే, కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ నేతలు ఎందుకు పట్టుబడుతున్నారంటే కేసీఆర్‌ని కాపాడటానికే,” అని ఘాటుగా బదులిచ్చారు.
మూడు పార్టీలు ఆడుతున్న ఈ మూడు స్తంభాలాట చూసి చూసి తెలంగాణ ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నా అవి మాత్రం ఈ మూడు స్తంభాలాట ఆడకుండా ఉండలేకపోతున్నాయి.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…