దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన బాలీవుడ్ సినిమాలు రామసేతు, థాంక్ గాడ్ . బ్రహ్మాస్త్ర సినిమా తరువాత బాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలే లేవు. రామసేతు సినిమా రాముని వారధి నేపధ్యం లో తెరకెక్కిన యాక్షన్ ఎడ్వెంచర్ సినిమా కాగా..థాంక్ గాడ్ సినిమా కల్పిత ఫాంటసీ కథ. దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన తెలుగు సినిమాలతో హాళ్ళన్నీ నిండిపోగా, ఈ బాలీవుడ్ సినిమాలకు థియేటర్లు కరువయ్యాయి. అయినా తక్కువ థియేటర్లలో విడుదల చేసారు. ఈ రెండు బాలీవుడ్ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్లు కూడా చాలా పేలవంగా ఉండటం ఆశ్చర్యకరం. ఇందులో రామసేతు సినిమా తెలుగు లో కూడా డబ్ అవ్వడం విశేషం.
అక్షయ్ కుమార్ ‘రామసేతు’ సినిమా కథ బాగున్నా..తీసిన విధానం థియేటర్లో ప్రేక్షకుడు కుర్చీలో పడుకునేలా చేసింది. అద్భుతంగా తీయాల్సిన సన్నివేశాలను సీరియల్ తీసినట్లు తీయడం, అతికీ అతకనట్లు ఉన్న గ్రాఫిక్స్, నీరసంగా నటించే నటులు కలిసి రామసేతు సినిమాని ప్లాప్ సినిమాగా నిలబెట్టాయి. హిందీ సినిమాలు అత్యంత ఆదరణ పొందే హైదరాబాద్ నగరంలో తొలిరోజు మార్నింగ్ షోలు నిలిచిపోయాయంటే రామసేతు సినిమాని ప్రేక్షకులు పక్కనపెట్టారని చెప్పవచ్చు. తెలుగు నటుడు సత్యదేవ్ కి ఈ హిందీ సినిమాలో మంచి పాత్ర ఉన్నా ప్లాప్ అవ్వడం వలన, సత్యదేవ్ కి కలిసొచ్చేదేంలేదు.
సిద్దార్థ్ మల్హోత్రా – రకుల్ ప్రీత్ నటించిన థాంక్ గాడ్ సినిమా పర్వాలేదనిపించుకున్నా..కథ, కథనాలు 90 కాలాల్లో ఉన్నట్లు ఉండటం అతి పెద్ద మైనస్. అజయ్ దేవగన్ లాంటి పెద్ద హీరో ఈ సినిమాలో చిత్ర గుప్తుడి పాత్ర పోషించినా, సినిమాకి సరైన ఓపెనింగ్స్ రాలేదు. ఇవన్నీ చూస్తుంటే బాలీవుడ్ కి ఇంకా మంచిరోజులు రాలేదనిపిస్తుంది. ఇక 2023 క్రిస్మస్ లో వచ్చే సినిమాల మీదే బాలీవుడ్ ఆశలు పెంచుకోవాలి. సౌత్ సినిమాలు చూసి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పుని బాలీవుడ్ పసిగట్టడంలో విఫలమైందని ఈ రెండు సినిమాల పరాజయాలే నిరూపిస్తున్నాయి.
బాలీవుడ్ తిరిగి తన వైభవాన్ని ఎప్పుడు పొందుతుందో ..ఏమో?



