స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను రద్దు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించ వచ్చని చెప్పింది. తాము చెప్పిన విధంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి నెలలో ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పింది.
ఈ పిటిషన్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిర్రు ప్రతాప్ రెడ్డి వేశారు. ఇప్పుడు అది రాజకీయ పోట్లాటకు దారి తీసింది. మంత్రి బొత్స నిన్న మాట్లాడుతూ… ఆయన టీడీపీ ఏజెంట్ అని, బీసీలను ఆ పార్టీ మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ఆయన చంద్రబాబుతో ఉన్న ఫోటోలను మీడియాకి విడుదల చేశారు.
అయితే అందుకు ప్రతిగా టీడీపీ వారు ఆ ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్, ఆరోపణలు చేసిన బొత్సతో ఉన్న ఫోటోలను విడుదల చేసింది. దీనితో ఈ వివాదం రసకందాయంలో పడింది. అమరావతి రైతుల కేసును వాదించడానికి ఐదు కోట్లు పెట్టి సుప్రీమ్ కోర్ట్ న్యాయవాదిని పెట్టిన జగన్ ప్రభుత్వం ఈ కేసుని తేలికగా తీసుకోవడం వల్లే బీసీలకు న్యాయం జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంది.



