చంద్రబాబు స్పీడు… రేవంత్‌ రెడ్డికి ఇబ్బందే?

చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే జెట్ స్పీడుతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయిస్తున్నారు. ప్రజలకు సంబందించి ముందుగా పింఛన్ పెంపు, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ ఫైల్స్‌పై సంతకాలు చేయడంతో ఆయా వర్గాల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలతో ఈవో బదిలీతో మొదలుపెట్టి జగన్‌ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలన్నిటికీ కొమ్ముకాసిన సీఎస్ జవహర్ రెడ్డితో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరినీ ఏరి పక్కన పెట్టేసి సమర్ధులను ఎంపిక చేసుకున్నారు.

ADVERTISEMENT

అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటించి అక్కడ విధించిన ఆంక్షలు, బారికేడ్లు అన్నిటినీ తొలగించి ప్రజలకు, రైతులకు సంతోషం కలిగించారు. బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు కొన్ని సూచనలు చేశారు. రాష్ట్ర ప్రజలను పీడించి వసూలు చేస్తున్న చెత్త పన్నుని నిలిపివేయించారు.

ఇవన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులలో చేసినవే. రాబోయే ఒకటి రెండు నెలల్లో రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలు ప్రారంభం కాబోతున్నాయి.

ఈ నెల 21 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఆనవాయితీ ప్రకారం ఒక రోజు ముందుగా మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు. కనుక తొలి మంత్రివర్గ సమావేశంలో శాసనసభ సమావేశాల షెడ్యూల్‌పై చర్చించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలు, ఎన్నికల హామీలపై చర్చించి మరికొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదివరకు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఆ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు వస్తున్నప్పుడు ఆంధ్రా ప్రజలందరూ జగన్‌ పాలనని కేసీఆర్‌ పాలనతో పోల్చిచూసుకునేవారు.

అదేవిదంగా తమ పాలన ఎంతగొప్పగా ఉందో చెప్పుకునేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రోడ్లు, విద్యుత్ కోతలు, ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించలేకపోవడం వంటివి చూపిస్తుండేవారు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిఎంగా బాధ్యతలు చేపట్టి ఇంత దూకుడుగా సాగుతుండటంతో, ఇప్పుడు తెలంగాణ ప్రజలు తమ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయనతో పోల్చి చూసుకోకుండా ఉండరు.

కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడి ప్రజాకూటమిలా భారీ మెజార్టీ లేదు. బొటాబోటి మెజార్టీ ఉన్నందున చాలా ఆచితూచి ముందుకు సాగాల్సి వస్తోంది. రేవంత్‌ రెడ్డి సిఎం అయినప్పటికీ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కాదని అడుగు ముందుకు వేయలేరు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చేసినప్పటికీ, అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ అమలుచేసేందుకు ప్రభుత్వానికి తగినంత ఆదాయం, ఖజానాలో నిల్వలు లేకపోవడంతో వాటి అమలులో జాప్యం అవుతోంది.

అందుకే ఫోన్ ట్యాపింగ్‌ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ అంటూ ప్రజల దృష్టిని మళ్ళించేందుకు సిఎం రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి వాదనలో వాస్తవం కూడా ఉంది.

కానీ 5 ఏళ్ళ జగన్‌ పాలనలో ఏపీ ఆర్ధిక పరిస్థితి తెలంగాణ కంటే చాలా దయనీయంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రిగా పరిపాలనలో అపార అనుభవం ఉంది. శాఖలు, వాటి అధికారుల పనితీరుపై పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. పైగా కేంద్రంలో భాగస్వామిగా కూడా ఉన్నారు.

కనుక ఈ పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే దూకుడుగా ముందుకు సాగగలుగుతున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆయనతో పోల్చి చూసుకోవడం మొదలుపెడతారు కనుక రేవంత్‌ రెడ్డి కూడా ఆయనతో పోటీ పడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

అభివృద్ధిలో పోటీ పడదామని చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే అప్పటి సిఎం కేసీఆర్‌తో అన్నారు. ఇప్పుడూ అదే అంటున్నారు. ఇందుకు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కూడా సిద్ధపడవచ్చు కానీ పరిస్థితులు కాస్త అనుకూలించాలి అంతే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

BB Telugu: Meluko Rohith Meluko

After the wild-card contestants enter, the basic expectation is that the existing contestants take the…

30 minutes ago

Jailer 2 Hindi: OTT Destroyed Hrithik Roshan’s Cameo?

Jailer 2 is scheduled to arrive in theatres this week. However, the makers have opted…

1 hour ago