రిజర్వేషన్ల గురించి ప్రసంగించిన సమయంలో చంద్రబాబు చేసిన పలు కామెంట్లు ప్రత్యర్ధి వర్గాలకు రాజకీయంగా వరమవుతున్నాయి. “ఏ కులంలో పుట్టాలనేది ఎవరు నిర్ణయిస్తారు? రిజర్వేషన్లు కావాలని ఎవరికి ఉండదు?” అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలపై కొన్ని కుల వర్గాలు మండిపడుతున్నాయి. ‘ముఖ్యమంత్రి తమను తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ, దళితులను అవమానిస్తున్నారంటూ’ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
“ఎన్నో సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ చేయలేని చంద్రబాబు హామీలను కాపులు నమ్మే స్థితిలో లేరని, దళితులను అవమానపరిచే రీతిలో చంద్రబాబు మాట్లాడారని, దీంతో సిఎంపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయాలని” ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, సోమవారం చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన సమయంలో… ‘ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకోరంటూ ఎస్సీలను కించపరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన అగ్రకుల అహంకారాన్ని వెళ్లగక్కారని మండిపడుతూ సిఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలువురు దళితులు మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటలలో క్షమాపణ చెప్పాలని పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ కూడా చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని, అవసరమైతే బిసిల రిజర్వేషన్లు పెంచాలని రఘువీరా సలహా ఇచ్చారు. దళితులకు కించపరిచేలా తానూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని ముఖ్యమంత్రి ఢిల్లీలో వివరణ ఇచ్చుకున్నారు. “ఎస్సీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే తప్పుబడుతూ” రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అయితే ఎస్సీ వర్గాలు ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక రాజధాని విజయవాడ, సూర్యారావుపేట్ పోలీస్ స్టేషన్లో మొదలుకొని శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రధాన స్టేషన్లలో చంద్రబాబుపై ఎస్సీ వర్గాలు కేసులు పెట్టడంలో నిమగ్నమయ్యారు.





