విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనలో విశాఖ పోలీసులు కేసులు నమోదు చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ వారిలో 32 మంది, టీడీపీ నుండి 20 మంది మీద మొత్తంగా 52 మంది మీద సెక్షన్ 341, 427, 283 కింద కేసులు పెట్టారు.
పైకి అంతా బాగానే ఉన్నా టీడీపీలో ప్రముఖుల మీద ఎక్కువ కేసులు పెట్టడం గమనార్హం. కేసులు నమోదైనవారిలో టీడీపీ నుంచి ప్రతిపక్షనేత చంద్రబాబు సహా పలువురు ప్రముఖులను చూపగా.. వైకాపా నుంచి మాత్రం కె.కె.రాజు, సత్తి రామకృష్ణారెడ్డి మాత్రమే ప్రముఖులు. మిగిలిన వారంతా సాధారణ కార్యకర్తలే.
టీడీపీ నేతల్లో చంద్రబాబు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప తదితరులతోపాటు మొత్తం 20 మందిని సెక్షన్ 151 కింద ముందస్తు అరెస్టు చేసినట్లు చూపారు. ఇది ఇలా ఉండగా ఈ విషయంగా టీడీపీ హైకోర్టు లో వేసిన పిటీషన్ రేపు మళ్ళీ హియరింగ్ కు వస్తుంది. ఏపీ డీజీపీ, విశాఖ డీసీపీని సంపూర్ణ వివరాలతో అఫిడవిట్ దాఖలు చెయ్యమని కోర్టు ఆదేశించింది.
ప్రాధమికంగా ఈ కేసులో కోర్టు పోలీసులను తప్పుపట్టిన సంగతి తెలిసిందే. మరో వైపు కోర్టు తీర్పు అనుకూలంగా రాగానే ఈ వారంలోనే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉండవచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మునుపటి పర్యటన కంటే భారీ ఏర్పాట్లకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.



