సచివాలయానికి శంకుస్థాపన! బాబు ముందు మరో టార్గెట్!

Chandrababu naidu layed foundation stone for temporary secretariateనవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం, వెలగపూడిలో ఎంపిక చేసిన స్థలంలో ముందుగానే నిర్ణయించిన సుముహూర్తం ప్రకారం సరిగ్గా 8.23 గంటలకు వేదమంత్రోచ్చారణల నడుమ చంద్రబాబు పునాది రాయి వేసి, దానిపై సిమెంట్ పూసి శంకుస్థాపనను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రారంభమైన ఈ సచివాలయం నిర్మాణాన్ని కేవలం నాలుగు మాసాల్లో పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసారు. జూన్ 15 నాటికి పనులు పూర్తి చేసే విధంగా టెండర్లను ఖరారు చేసిన ప్రభుత్వ టార్గెట్, గతేడాది పట్టిసీమ ప్రాజెక్ట్ ను తలపిస్తోంది. పట్టిసీమ కోసం రేయింబవళ్ళు పని చేసి శభాష్ అనిపించుకున్న వైనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ప్రశంసలను అందుకుంది. అలాగే తాజాగా దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా అదే లక్ష్యంతో సాగుతోంది. ఇటీవలే ప్రారంభమైన పనులను ఆగష్టు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దానికి తగిన విధంగానే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ADVERTISEMENT

చంద్రబాబు నిర్దేశించుకున్న లక్ష్యాలలో తాజాగా తాత్కాలిక సచివాలయం కూడా చేరింది. ఈ పనులన్నీ అనుకున్న సమయంలోపు పూర్తి చేసినట్లయితే ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న వారవుతారు. అలాగే, ఈ అభివృద్ధిని చూసి భూసమీకరణ విషయంలో రాష్ట్రంలో అక్కడక్కడ తలెత్తుతున్న వివాదాలు కూడా సమసిపోవచ్చు. ఆశించిన సమయంలోనే అన్నీ పనులు పూర్తి చేసి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తారని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories