
ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇద్దరూ గత 5 ఏళ్ళలో అనేక కష్టాలు, సమస్యలు, సవాళ్ళు అన్నిటినీ ఎదుర్కొని ఆరు నెలల తేడాతో ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. అయితే ఇద్దరి పాలన, వ్యవహార శైలిలో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తన సహజశైలిలో చాలా దూకుడుగా ముందుకు సాగారు. తలకు మించిన భారమే అయినా ఎన్నికల హామీలను ఒకటొకటిగా అమలుచేశారు. లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కనీయకుండా చేసి, ఆ పార్టీని సగం ఖాళీ చేసి, తన ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తున్న కేసీఆర్‌ని ఫామ్‌హౌస్ గుమ్మం దాటి బయటకు రాకుండా కట్టడి చేయగలిగారు.
సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డిలా తొందరపడటం లేదు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ వార్తలు వచ్చినా, ఆ పధకంతో తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్ధిక భారం అన్నిటినీ గమనించి ఆచితూచి అడుగువేయాలనుకుంటున్నారు.
అయితే రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎవరూ ఈ పధకం ఎందుకు అమలుచేయడం లేదని నిలదీయడం లేదు కూడా. ఉచిత ప్రయాణం బదులు టికెట్ ఛార్జీలు 50 శాతమో, 75 శాతమో తగ్గించినా సరిపోతుందని అంటున్నారంటే వారు కూడా దీని సాధకబాధకాలు అర్ధం చేసుకొని సర్ధుకుపోతున్నారన్న మాట!
అంటే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి హడావుడిగా ఈ పధకం అమలుచేసి ఇప్పుడు వెనక్కు తగ్గలేని పరిస్థితి కల్పించుకున్నట్లు అర్దమవుతోంది.
ఎన్నికల హామీలో రేవంత్ రెడ్డితో పోలిస్తే సిఎం చంద్రబాబు నాయుడు కాస్త వెనకబడిన్నప్పటికీ, రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడేలా చేస్తున్నారు.
నెలకు రూ.4,000 పింఛన్లు నెలనెలా 1వ తేదీన అందిస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతీ నెల సకాలంలో జీతాలు చెల్లిస్తున్నారు. మళ్ళీ పరిశ్రమలు, పెట్టుబడుల మాటలు వినిపిస్తున్నాయి. అమరావతికి నిధులు సాధించుకున్నారు. పోలవరం పనులు మొదలుపెడుతున్నారు. కేంద్రం కూడా రాష్ట్రాభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తోంది. నిధులు విడుదల చేస్తోంది.
విజయవాడ వరదలలో చంద్రబాబు నాయుడుకి 74 ఏళ్ళు వచ్చినా ఎప్పటిలాగే చాలా చురుకుగా పనిచేస్తూ, చేయించగలుగుతున్నారని నిరూపించుకున్నారు.
ఈ విషయంలో చంద్రబాబు నాయుడుతో పోలిస్తే యువకుడైన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి వరద బాధితులను ఆదుకోవడంలో, సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో చాలా వెనుకబడిపోయిన్నట్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే హైడ్రాతో కూల్చివేతలు మొదలుపెట్టడం తొందరపాటే అని చెప్పక తప్పదు. ముందుగా ఓ మూడేళ్ళపాటు తన మార్క్ పాలన, అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలుచేసి చూపి ప్రజల మనసులు గెలుచుకొని, పూర్తి పట్టు సాధించిన తర్వాత హైడ్రాని మొదలుపెట్టి ఉంటే ఇన్ని విమర్శలు, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు.
నిజానికి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చక్కగా వ్యూహ రచన చేసుకుంటూ, అపర చాణక్యుడినని మిడిసిపడుతున్న కేసీఆర్‌ని చావు దెబ్బ తీశారు. కానీ అధికారంలోకి వచ్చాక కూడా దూకుడుగా ముందుకు సాగుతుండటం వలన కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.
చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. పైగా గత 5 ఏళ్ళలో చాలా డక్కామొక్కీలు తిన్నారు. కనుక జగన్, వైసీపి నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా, సొంత పార్టీలో ఎన్ని ఒత్తిళ్ళు వస్తున్నా సిఎం చంద్రబాబు నాయుడు తొందరపాటు ప్రదర్శించడం లేదు. నిదానంగానే ముందుకు సాగుతున్నారు.
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఆరు నెలల తేడాతో ముఖ్యమంత్రులయ్యారు. అదే తేడాతో వచ్చే ఎన్నికలని ఎదుర్కొంటారు. కనుక ఆలోగా ఇద్దరిలో ఎవరు ఎక్కువ మార్కులు సాధిస్తారో చూద్దాం.
After the 2024 Assembly election victory, TDP, Jana Sena and BJP are preparing for their…
Nandamuri Balakrishna has agreed to surrender a portion of his residential property for road-widening works…