నవ్యాంధ్ర రాజధానికి అతి చేరువలో గల విజయవాడ నగర వాసులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. రిపబ్లిక్ డే వేడుకల అనంతరం ప్రసంగించిన చంద్రబాబు… “విజయవాడ వాసులు ప్రపంచమంతా వెళ్లి వ్యాపారాలు చేస్తుంటారు, కానీ సొంత ప్రాంతం విషయానికి వచ్చేసరికి సంకుచితంగా ఆలోచిస్తుంటారని, తాత్కాలిక ప్రయోజనాలను వెతుక్కోవద్దని నగర ప్రజలకు సూచనలు చేసారు. చిన్న చిన్న స్వార్థాలు వదులుకోకపోతే శాశ్వతంగా నష్టపోతామని, అద్దెలు భారీగా పెరిగాయని అధికారులు చెబుతున్నారని, తాత్కాలిక ప్రయోజనాలు ఆశించవద్దని” విజయవాడ వాసులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు.
వాస్తవ రూపానికి వస్తే, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని చెప్పక తప్పాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, విజయవాడ వాస్తవ్యులు తగులుతుంటారు. వ్యాపారమో లేక ఇతరత్రా పనులకో గానీ విజయవాడ పేరు పలు రకాలుగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే, సొంత ప్రాంతానికి సరైన ప్రాధాన్యత ఇవ్వరనే భావన కూడా గతంలో పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడమే సంచలనంగా మారింది. అయితే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన నాడు ప్రజలు కూడా వాటిని స్వీకరిస్తారని అర్ధం చేసుకోవాలి.





