గురువారం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు, మార్షల్స్ కు మధ్య జరిగిన రగడ కొత్త మలుపు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అసెంబ్లీలో చీఫ్ మార్షల్ ను ప్రతిపక్ష నేత బస్టర్డ్ అని దూషించారని ఆరోపించారు. అయితే తెలుగుదేశం పార్టీ దీనిని తీవ్రంగా ఖండించింది. నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోని విడుదల చేసింది.
అందులో చంద్రబాబు ‘నో క్వశ్చన్’ అన్నట్టుగా ఉంది. లేని దాన్ని ఉన్నట్లుగా అసెంబ్లీలో చూపించారని విమర్శించారు. తన నోటి నుంచి ఎప్పుడు బూతులు రావని, ఎప్పుడైనా కోపం వస్తే గట్టిగా మాట్లాడతానని చంద్రబాబు హౌస్ లో చెప్పారు. ఆ తరువాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా సీఎం జగన్ వక్రీకరించారంటూ సీఎంపై ప్రివిలీజ్ నోటీస్ ఇచ్చారు.
ఇది అలా ఉండగా ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని, దీనిపై స్పీకర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని మంత్రులు డిమాండ్ చేశారు. నిరాశ, నిస్పృశతో చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏమాత్రం గౌరవప్రదం కాదన్నారు. ఉద్యోగులను పట్టుకుని ఎంత తప్పుడు మాటలు మాట్లాడతారా? అంటూ నిలదీశారు.
తనకు కేటాయించిన గేటులోంచి కాకుండా మరో గేటులోంచి వచ్చిన కారణంగానే ఇబ్బంది వచ్చింది అని అర్ధం వచ్చేలా మంత్రి కన్నబాబు చెప్పుకొచ్చారు. అది నిజం కాదని, ఒకవేళ నిజమే అనుకున్నా… మాజీ ముఖ్యమంత్రి కేటాయించిన గేటు కాకుండా వేరే గేటు వాడితే అనుమతించరా? మొహం మీదే గేటు వేసేస్తారా అని టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు.





