చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా చందమామ మీదకు ఒక రోబోటిక్ ల్యాండర్ ను పంపించే ప్రయత్నం చేసి చివరి అంకంలో విఫలమైన సంగతి తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ లోకేషన్‌ను ఇస్రో గుర్తించిందని కాసేపటి క్రితం ప్రకటించారు.
చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ల్యాండర్ థర్మల్ ఇమేజ్‌ను ఆర్బిటర్ క్లిక్ చేసినట్టు పేర్కొన్నారు. అయితే, ల్యాండర్ నుంచి ఇప్పటికీ సిగ్నల్స్ అందడం లేదు. సంబంధాల పునరుద్ధరణ కోసం శాస్త్రవేత్తల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరో రెండుమూడు రోజుల్లో ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్ వెల్లడించారు. అయితే సంబంధాల పునురుద్ధరణ జరిగిన మిషన్ ఆగిపోయినట్టే.
కాకపోతే దేని కారణంగా అలా జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తప్పుని తదుపరి మిషన్లలో సరిదిద్దుకునే అవకాశం ఉంది. దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూసిన క్షణాలు.. ఫలితం తేలకకుండానే ముగిసిపోవడం శాస్త్రవేత్తలను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయినా ఈ కష్టకాలంలో దేశం మొత్తం మన శాస్త్రవేత్తల వైపు నిలిచి వారికి మనోధైర్యం కలిగించారు. ల్యాండర్ విక్రమ్ విఫలం అయినప్పటికీ ఆర్బిటర్ ఏడాది పాటు చంద్రుడి చుట్టూ తిరిగి ఫోటోలు, డేటా పంపిస్తుంది.





