విజయనగరంలో ఒక శతాబ్ధం క్రితం నిర్మించిన గజపతుల రాతి కోట నేటికీ చెక్కుచెదరలేదు. నేటికీ చాలా ధృడంగా ఉంది. అది ఎందరికో ఆశ్రయం కల్పిస్తోంది కూడా. తాజాగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను దానిలో ఆశ్రయం పొందారు.
కానీ చిన్న శ్రీను వెళ్లిపోవడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దశాబ్దాల పాటు శ్రమించి నిర్మించుకున్న రాజకీయ కోట ఆయన కళ్ళ ముందే పేకమేడలా టపటపా కూలిపోతోంది.
ఇంతకాలం ఆయన కోటకు మేనల్లుడు చిన్న శ్రీను బలమైన పునాదిలా నిలిచారు. కానీ అయన పార్టీని వీడి టీడీపిలో చేరిపోవడంతో బొత్స కోట పునాదులు కదిలిపోతున్నాయి.
ముఖ్యంగా బొత్సకు, అయన కుటుంబానికి ఆయువు పట్టు వంటి చీపురుపల్లి నియోజకవర్గంలోనే వైసీపీ ఖాళీ అయిపోతోంది.
ఇప్పటికే చీపురుపల్లి జడ్పిటిసి వలిరెడ్డి శిరీష, జిల్లా వైసీపీ ప్రచార విభాగ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు దంపతులు రాజీనామాలు చేయగా, వారి తర్వాత మెరకముడిదాం మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావు, మరో 13 గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీలు, వారి అనుచరులు వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.
తాజాగా చీపురుపల్లి, గరివిడి మేజర్ పంచాయతీలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, స్థానిక వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక కనకమహాలక్ష్మి దేవాలయం మాజీ ఛైర్మన్ వాసుదేవరావు తదితరులు కూడా వైసీపీకి రాజీనామా చేశారు.
చీపురుపల్లి నియోజకవర్గంలోనే దాదాపు 400 కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోకుండా ఆపేందుకు బొత్స సత్యనారాయణ కుటుంబం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని తాజా రాజీనామాలతో స్పష్టమైంది. అయితే ఈ రాజీనామాలు ఇక్కడితో ఆగకపోవచ్చు.
కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ ఖాళీ అయిపోతుండటంతో బొత్స కుటుంబం రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. కనుక జిల్లాలో తన రాజకీయ ఆధిపత్యాన్ని, వైసీపీ క్యాడర్‌ని ఆయన ఎలా కాపాడుకుంటారో?ఈ స్థానిక గండం నుంచి ఎలా గట్టెక్కుతారో?





