గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకప్పుడు తనకు మిత్రుడని, ఇప్పుడు స్నేహితుడు అంటే ‘మిత్రుడు’కు అర్ధం పోతుందని అన్నారు చింతమనేని ప్రభాకర్. నిజంగా తనకు స్నేహితుడు అనుకుంటే తన కూతురు వివాహానికి కూడా పిలవాలి కదా, కానీ పిలవలేదు. ఒకవేళ మిత్రుడు అనుకుంటే, అతను మాట్లాడే భాషను తాను అంగీకరించినట్లే అవుతుందని కొడాలి నాని గురించి చెప్పుకొచ్చారు చింతమనేని.
గుడివాడ కాసినో వ్యవహారానికి సంబంధించి, ఇలాంటివి బహుశా తాను గనుక చేసి ఉన్నట్లయితే తమ పార్టీ అధినేత ఈ పాటికి తోలు తీసేసేవారని, పార్టీలో నుండి సస్పెండ్ కూడా చేసేసేవారని, కానీ కొడాలి నాని పార్టీ అధినేత కనీసం వివరణ కూడా ఇవ్వలేదని చెప్పడం విస్మయానికి గురిచేస్తుందన్న భావనను వ్యక్తపరిచారు. ఒకవేళ నిజంగా తన వల్ల ఇలా జరిగి ఉంటే తాను అంగీకరించి క్షమాపణలు చెప్పేవాడినని తెలిపారు.
ఈ సారి కోడి పందాలలో గుడివాడలో అత్యధికంగా 27 లక్షలకు పోటీ జరిగిందన్న సమాచారం తనకు వచ్చిందని, కాసినోలోనే ఈ సారి అన్ని ఏర్పాట్లు జరిగాయని, దీనిని కొడాలి నాని హుందాగా అంగీకరించి ఉంటే విషయం ఇంత దాకా వచ్చేది కాదని, తప్పులు చేయడం మానవ సహజమని, తెలిసి చేసినా, తెలియక చేసినా తన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ప్రజలకు క్షమాపణలు చెప్తే బాగుండేదని అన్నారు.
అలా కాకుండా నేను చచ్చిపోతాను… నేను చచ్చిపోతాను… అంటే ఎవరు ఆపుతారు? ఇప్పుడు జరిగిందని నిరూపణ అయ్యింది కదా, చనిపోమని చెప్పండి, ఎవరు పట్టించుకుంటారు? జగన్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఇది అద్దం పడుతుందని చెప్పుకొచ్చారు. ఈ సారి తాను కోడి పందాలు ఆడాను, డబ్బులు కూడా పోగొట్టుకున్నాను, కాలం కలిసి రాకపోతే అన్ని ఇలాగే అవుతాయని ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన భావాలను పంచుకున్నారు.



