‘పవన్’తో కలిసేది లేదని తెగేసి చెప్పిన ‘చిరంజీవి!’

chiranjeevi speaks about party change‘జనసేన’ పార్టీ స్థాపించి, ఆ తర్వాత బిజెపి, టిడిపిలకు మద్దతు ఇచ్చిన పవర్ స్టార్ ఉదంతం మెగా బ్రదర్స్ మధ్య చిచ్చుకు కారణమైందన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో ఈ ఇద్దరు సోదరులు కూడా ఒకే తాటి పైకి వస్తున్నారని, అటు సినిమా రంగంతో పాటు, రాజకీయ పరంగానూ ఒకే నీడన చేరతారన్న వార్తలు హల్చల్ చేసాయి. ముఖ్యంగా చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉండడంతో, త్వరలోనే బిజెపి కండువా కప్పుకోవడానికి మెగాస్టార్ సిద్ధమయ్యారని, దీనికి పవన్ కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసారన్న సమాచారం మీడియా వర్గాల్లో సందడి చేసింది.

ఒక్కసారిగా గుప్పుమన్న ఈ వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. “మళ్ళీ మళ్ళీ ఇలాంటి పుకార్లకు ప్రాధాన్యత ఇవ్వవద్దని, తానూ రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని” కుండ బద్దలు కొట్టారు. హైదరాబాద్, ఫిలిం నగర్ సన్నిధానంలో జరిగిన మూడు ఆలయాల అంకురార్పణలో సతీసమేతంగా పాల్గొన్న చిరంజీవి, తదనంతరం మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఈ విషయాన్ని తేల్చారు. మెగాస్టార్ చేసిన ఈ ప్రకటన, తన రాజకీయ జీవితంపై స్పష్టమైన అభిప్రాయం తెలియజేసినప్పటికీ, మెగా ఫ్యాన్స్ ను మాత్రం తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది.

ADVERTISEMENT

ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల నుండి కోలుకోవాలంటే కనీసం మరో దశాబ్దం పట్టవచ్చు. లేదంటే అసలు పార్టీఏ కనుమరుగవ్వచ్చు. మరి చిరంజీవి కాంగ్రెస్ లో ఉండి దేనికి ప్రయోజనం అన్న అభిప్రాయాలు సర్వత్రా వినపడుతున్నాయి. ఒకవేళ మెగాస్టార్ పూర్తి స్థాయిగా సినిమాల్లోకి ప్రవేశిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక, కావాల్సినంత సమయం లభిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మెగాస్టార్ చేసిన ప్రకటన మరో విధంగా స్పష్టమైన సంకేతాలను వెల్లడించింది.

రాజకీయంగా తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసేది లేదని చిరంజీవి తేల్చిచెప్పినట్లయ్యింది. మోడీ నినాదం అందుకున్న పవన్, దానికే కట్టుబడి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుండి మండిపడుతున్నారు. ఒక్క కాంగ్రెస్ కే కాదు, ఆ పార్టీ నుండి పుట్టుకొచ్చిన వైసీపీ వంటి పార్టీలకు కూడా పవన్ వ్యతిరేకంగా పనిచేసారు. కాంగ్రెస్ తో జత కట్టేది అవకాశం పవన్ కు లేకపోగా, కాంగ్రెస్ ను వీడననే చిరంజీవి ప్రకటనతో… ఈ ఇద్దరి మెగా సోదరులు ఇక రాజకీయంగా కలిసే అవకాశం లేదని స్పష్టమైంది. దీంతో ‘నిట్టూర్పు’ను ప్రదర్శించడం మెగా అభిమానుల వంతవుతోంది.

ADVERTISEMENT
Latest Stories