
తెలుగు ప్రజలకి 1978లో అన్నపూర్ణ స్టూడియోస్ ఓ కొత్త నటుడిని పరిచయం చేసింది. అతనే చిరంజీవి. ప్రాణం ఖరీదు సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి ఆ తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఆయన ప్రయాణం అందరికీ తెలిసిందే.
కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినవారు నిలద్రొక్కుకోవడానికి ఎంతగా తపిస్తారో చిరంజీవి అంతకంటే ఎక్కువే తపించారని చెప్పవచ్చు. అందుకే ‘మన ఊరి పాండవులు’, ‘పున్నమినాగు’, ‘ఇది కధ కాదు’ వంటి సినిమాలో నేడు ఎవరూ ఊహించలేని పాత్రలు చేశారు.
Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?
చిరంజీవి సినీ ప్రస్థానం రెండో దశలో హీరోగా ఎదిగిన తర్వాత ఫ్యామిలీ హీరోగా సినిమాలు చేస్తూనే కొండవీటి రాజా, రాక్షసుడు, బిల్లా రంగా, చంటబ్బాయ్, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, అత్తకు మొగుడు అమ్మాయికి మొగుడు, ముఠా మేస్త్రీ, ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి అనేక సూపర్ డూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు చేశారు.
ఆ సమయంలోనే ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ స్వయంకృషి, ఆపద్బాంధవుడు, శ్రీ మంజూనాధ వంటి సినిమాలు చేశారు. అయితే చిరంజీవిని మాస్ హీరోగా అభిమానించే మాస్ ప్రేక్షకులు, అభిమానులకు అవి అంతగా ఎక్కలేదు కానీ అవే చిరంజీవికి దర్శక నిర్మాతలకు పలు అవార్డులు తెచ్చి పెట్టాయి.
Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..
ఆ అవార్డుల గురించి చెప్పుకోవాలంటే అదే ఓ పెద్ద పుస్తకం అవుతుంది. చిరంజీవి జీవితం తెరిచిన పుస్తకం వంటిదే. కనుక ఆయన గురించి వివరించబోవడం కొండని అద్దంలో చూపే ప్రయత్నమే అవుతుంది.
చిరంజీవి సినీ ప్రస్థానంలో మెగాస్టార్ స్థాయికి చేరుకోవడం వెనుక అంతా ఆయన స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణ, అంతకు మించి నలుగురితో స్నేహపూర్వకంగా ఉండటమే కారణమని అందరికీ తెలుసు.
Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్, జగన్‌లని టచ్ చేయగలరా?
అప్రతీహతంగా సాగుతున్న చిరంజీవి సినీ ప్రస్థానంలో ‘రాజకీయ బ్రేక్’ తీసుకోవాలనే నిర్ణయం వికటించింది. అయితే తాను రాజకీయాలలో ఇమడలేనని చిరంజీవి త్వరగా గుర్తించడం వలన చాలా మేలు కలిగిందని చెప్పవచ్చు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఘనంగానే సాగుతున్నప్పటికీ మొదటి 20-30 సంవత్సరాలలో కనపడిన ఆ జోరు, విలక్షణత కనిపించడం లేదనే చెప్పక తప్పదు.
అయితే చిరంజీవితో సినిమా అంటే నిర్మాతలు, బయ్యర్లు, ఇంకా చాలా అంశాలను దృష్టిలో ఉంచుకొని లెక్క ప్రకారమే చేయాల్సి రావడంతో చిరంజీవికి ఫ్రీ హ్యాండ్ లభించడం లేదని చెప్పవచ్చు. అయినప్పటికీ ‘విశ్వంభర’వంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే హిందీ పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ళు నిండినప్పటికీ నేటికీ ఏవిదంగా ప్రేక్షకులను అలరిస్తున్నారో మన చిరంజీవి కూడా అలాగే అలరిస్తూనే ఉంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు.
స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలుస్తున్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు ప్రజలందరి తరపున మిర్చీ9 తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.