నందమూరి వర్సెస్ మెగా! తేడా అదే!

chiranjeevi vs balakrishna political career‘నందమూరి నటసింహం’ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడించింది. ఈ మూడు సంవత్సరాలలో తొలి ఏడాదిలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించగా, ఆ తర్వాత నుండి హిందూపూర్ ఎమ్మెల్యే గా సేవలు అందిస్తున్నారు. అయితే వర్తమాన క్రియాశీలక రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరపున కీలక పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ, అటు సినీ పరిశ్రమలో కూడా హీరోగా కొనసాగుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే “లెజెండ్” సినిమాను పూర్తి చేసి విడుదల చేయగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత “లయన్” సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మేలో విడుదలైన “లయన్” పూర్తవ్వగానే, ‘డిక్టేటర్’ను సెట్స్ పైకి తీసుకువెళ్ళిన బాలయ్య బాబు, రానున్న సంక్రాంతికి ఆ సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్లల్లో బాలయ్య మూడు సినిమాలను విడుదల చేసారు. మరి చిరంజీవి మాత్రం ఒక్క సినిమా చేయడానికి గత ఎనిమిది సంవత్సరాలుగా తర్జనభర్జన పడుతుండడం విశేషం.

ADVERTISEMENT

2007లో విడుదలైన “శంకర్ దాదా జిందాబాద్” తర్వాత ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అయితే అనూహ్య రాజకీయ పరిణామాల నేపధ్యంలో అధికార పార్టీలోకి జంప్ చేసిన చిరు మూడేళ్ల పాటు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్రమంత్రి అన్న పేరుకే గానీ, చిరంజీవి పెద్దగా చేసిందేమీ లేదన్నది బహిరంగ విషయమే. మరో విధంగా చెప్పాలంటే, ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా బాలకృష్ణ పోషిస్తున్నటువంటి పాత్రను కూడా కేంద్రమంత్రిగా చిరు నిర్వహించలేదు. అయినప్పటికీ తన 150వ సినిమా చేయడానికి చిరు ధైర్యం చేయలేకపోయారు.

ఇక, గత 20 మాసాలుగా చిరు ప్రత్యక్ష రాజకీయాలకు సైతం దూరంగా ఉన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు చిరు సాధించింది ఏమిటి అంటే… 2014లో విడుదలై సూపర్ హిట్ అయిన విజయ్ “కత్తి” సినిమాను తన 150వ చిత్రంగా 2016లో రీమేక్ చేయబోతున్నాను అని! తాజాగా ప్రకటన అయితే వచ్చింది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అన్న అంశాలు ఇప్పటికీ ప్రశ్నార్ధకమే.

బాలకృష్ణకు అవలీలగా సాధ్యమైన విషయం చిరుకు మాత్రం ఎందుకు అసాధ్యంగా కనపడుతోంది అంటే… కేవలం అది ‘అతి జాగ్రత్త’ వలనేనని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఆ ‘అతి జాగ్రత్త’కు పోయే తెలుగు రచయితల కధలను కాదని, ఓ తమిళ సినిమా రీమేక్ వైపుకు మొగ్గు చూపారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. మరో అంశం చిత్తశుద్ధి. సినీ హీరోగా ఉన్నంత వరకు అభిమానులకు చాలా దగ్గరగా ఉన్న మెగాస్టార్, పొలిటికల్ పార్టీ ఏర్పాటు తర్వాత అభిమానులకు దూరంగా జరిగారనేది స్వయంగా అభిమానులే చెప్తున్న విషయం. ముఖ్యంగా రాజకీయ పార్టీ ఏర్పాటు తర్వాత మెగాస్టార్ వ్యవహార శైలిలో చాలా మార్పులు సంభవించాయని, అంతకు ముందు వున్న చిత్తశుద్ధి, కార్యదక్షత లోపించాయని పరిశీలకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. సరిగ్గా ఇక్కడే బాలకృష్ణకు, చిరు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇంతలా తాపత్రయపడుతున్న 150వ సినిమా మరో ‘ప్రజారాజ్యం’లా కాదు కదా! ఏమో ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో పెదవి విప్పడానికి సంశయిస్తున్నారు. అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గీయుల్లోనూ ఆ నమ్మకాన్ని కలిగించిన ఘనత ‘మెగాస్టార్’దే మరి!

ADVERTISEMENT
Latest Stories