తమిళనాడు సిఎం విజయ్‌ కూడా రైట్ రైట్!

CM Vijay launches Vettri Payanam free bus scheme

తమిళనాడు సిఎం విజయ్‌ నేతృత్వంలోని టీవికే ప్రభుత్వం కూడా అచ్చంగా ‘జగన్‌ మోడల్ పాలన’కే మొగ్గు చూపుతున్నట్లుంది. నెలల క్రితం సిఎం పదవి చేపట్టినప్పటి నుంచి సగటున నెలకో కొత్త సంక్షేమ పధకం ప్రారంభిస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో కొత్తగా పుట్టిన శిశువులకు ‘మావయ్య ఉంగరాలు’ అంటూ బంగారు ఉంగరాల పధకం ప్రవేశపెట్టారు. ఇవి కాక మరో అరడజను పధకాలు మొదలుపెట్టారు.

ADVERTISEMENT

తాజాగా నేడు గాంధీ జయంతి సందర్భంగా ‘వెట్రి పయనం’ అనే మరో కొత్త పధకం ప్రారంభించారు. ఆంధ్రాలో ‘స్త్రీ శక్తి’, తెలంగాణలో ‘మహాలక్ష్మి’ పేర్లతో అమలవుతున్నట్లే విజయ్‌ ప్రభుత్వం కూడా ‘వెట్రి పయనం’ ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు.

చెన్నైలోని కోయంబేడు బస్టాండులో పచ్చ జెండా ఊపి ఈ పధకాన్ని ప్రారంభించిన తర్వాత మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారితో ముచ్చటించారు. సిఎం విజయ్‌ వారికి స్వయంగా ‘జీరో టికెట్స్’ అందజేశారు.

తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకేలతో సహా దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు దశాబ్దాల పాటు డక్కామొక్కీలు తింటూ నేర్చుకున్న రాజకీయ పాఠాలను సిఎం విజయ్‌, పార్టీ ప్రారంభించిన ఏడాదిలోనే నేర్చేసుకుని తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

అక్కడితో తన గమ్యం చేరినట్లు ఆగిపోలేదు. ఇటువంటి ప్రజాకర్షక పధకాలతో అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే సామాన్య, నిరుపేద ప్రజల ముఖ్యంగా మహిళల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కనుక రాబోయే నాలుగున్నరేళ్ళు ఇదేవిధంగా కొనసాగితే, సిఎం విజయ్‌ తప్పకుండా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా బలపడతారు.

ఈ పధకాలతో ఎలాగూ ఏపీ, తెలంగాణ ఆర్టీసీకి భారీగా లాభాలు ఆర్జించి పెడుతోందని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు సిఎం విజయ్‌ కూడా రైట్ రైట్ అనేశారు.

కనుక దక్షిణాదిన అన్ని రాష్ట్రాలు కలిపి ఉమ్మడిగా ఈ పధకాన్ని నిర్వహించగలిగితే అటు ప్రభుత్వాలు, ఇటు మహిళలు లాభాపదవచ్చు. కన్యాకుమారి నుంచి ఇచ్చాపురం వరకు మహిళలు ఉచితంగా ప్రయాణించ గలుగుతారు కదా?

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో భాగస్వామిగా మారి, దేశమంతటా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించవచ్చు.

అదీ విజయవంతమైతే ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉచిత రైలు, విమాన ప్రయాణాలకు కూడా ఈ పధకాన్ని విస్తరిస్తే ఇక తిరుగే ఉండదు.

ఆనక కుదిరితే ట్రంప్‌తో మాట్లాడి అమెరికాకు కూడా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories