బిజేపి ధాటికి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి బలహీనపడ్డాయనేది కంటికి కనిపిస్తున్న వాస్తవం. అయితే ఇండియా కూటమిని రాజకీయంగా బలహీనపడటంతో వాటికి మళ్ళీ కాంగ్రెస్ పెద్ద దిక్కుగా కనిపించడం సహజం. కనుక రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా అంగీకరించే అవకాశం కూడా ఉంది.
కనుక ఇప్పుడు ఈ అవకాశాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించి, అప్పుడే తగిన వ్యూహాలు, కార్యాచరణతో రంగంలో దిగినట్లే కనిపిస్తోంది.
బహుశః కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి అది కథ నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా ‘కాక్రోచ్‌లు’ అందరికీ సమస్యగా ఉంటాయి. ప్రస్తుతం ఎన్డీయే కూడా వాటితో ఇబ్బంది పడుతోంది. ఎన్డీయేకి ఏర్పడే సమస్య ఇండియా కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ అవకాశంగా మారుతుందనే సామాన్య గణితం అందరికీ తెలిసిందే.
అలాగని ఈ ‘కాక్రోచ్‌లు’ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా? అని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. కానీ కాక్రోచ్‌లకు ముందో.. వెనుకో.. లేక పక్కనో కాంగ్రెస్ మిత్ర పక్షాలు, బిజేపి వ్యతిరేక శక్తులు కనిపిస్తునే ఉన్నాయి. ‘కాక్రోచ్‌లు’ చేసే హడావుడితో కాంగ్రెస్, ఇండియా కూటమికి భవిష్యత్ పట్ల మళ్ళీ కాస్త ఆశ, మనసులో ధైర్యం కలిగినట్లే ఉంది. అలాగే దేశంలో బీఆర్ఎస్, వైసీపీ, టీవీకే పార్టీలతో సహా పలు ప్రాంతీయ పార్టీలు కాక్రోచ్‌లు హడావుడి చూసి నూతనోత్సాహం పొందుతున్నాయి.
కాక్రోచ్‌లు ఢిల్లీ నుంచి అక్టోబర్ 2న ముంబాయికి షిఫ్ట్ అవడం యాదృచ్చికమో లేదా అనాలోచితమో కానే కాదు. తమ ఆందోళనలను దేశమంతటా విస్తరింపజేసే ప్రయత్నంలో భాగమే ఇది. కనుక రాబోయే రోజుల్లో కోల్‌కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో కూడా కాక్రోచ్‌ల హడావుడి జరుగవచ్చు.
వాటి ఆందోళనలు విజయవంతం చేసేందుకు అందరూ తలో చెయ్యి వేయకుండా ఉండరు. ఎందుకంటే, జెన్-జీకి మద్దతు ఇవ్వడం అంటే ‘పొలిటికల్ పవర్ గ్యారెంటీ టర్మ్ ఇన్స్యూరెన్స్’ తీసుకున్నట్లే! వ్యతిరేకించడమంటే ఓటమిని డబ్బిచ్చి కొనుకున్నట్లే!
కానీ ఒక్క విషయం.. మా వెనుక ఎవరూ లేరని, కేవలం దేశ భవిష్యత్ కోసం నడుం బిగించిన జెన్-జీలం మేమని గట్టిగా చెప్పదలిస్తే, అధికార, ప్రతిపక్షాలు ఆడే ఈ పవర్ ప్లేలో కాక్రోచ్‌లు నలిగిపోకుండా జాగ్రత్తపడటం అంతే అవసరం. ఎందుకంటే దేశ భవిష్యత్ నిజంగానే జెన్-జీపైనే ఆధారపడి ఉంటుంది కనుక!






