సీనియర్ హాస్యనటుడు వేణు మాధవ్ కాసేపటి క్రితం కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో గత రెండు వారాలుగా చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు.
1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంప్రదాయం’తో వేణుమాధవ్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో పవన్‌కల్యాణ్ ‘తొలిప్రేమ’వేణుమాధవ్‌కు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 2000లలో విడుదలైన అన్ని పెద్ద సినిమాలలో ఆయన ఉండాల్సిందే.
ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రంతో హాస్యనటుడిగా పరిచయమైన వేణుమాధవ్ మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ‘హంగామా’తో కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత ‘ప్రేమాభిషేకం’ తో నిర్మాతగా మారారు. అయితే ఆ సినిమా ఆయనకు హీరోగానూ, నిర్మాతగానూ నష్టాన్ని మిగిల్చింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన 2014 నుండి సినిమాలు తగ్గించుకున్నారు.
2016లో ఆయన చివరి సినిమా విడుదల అయ్యింది. ఇక రాజకీయాలకు వస్తే… ఆయన మొదటి నుండీ టీడీపీ అభిమాని. పార్టీ కోసం అనేక సార్లు ప్రచారం కూడా చేశారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆయన తన సొంత ఊరు కోదాడ నుండి పోటీ చెయ్యాలని భావించినా టిక్కెట్ దక్కలేదు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుందాం.



