తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయకత్వానికి వీరాభిమాని అయిన కమెడియన్ వేణుమాధవ్ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటూ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నాడు. భూమా కుటుంబం తనకు సొంత కుటుంబం లాంటిదని, మంత్రి భూమా అఖిలప్రియ తన అన్న బిడ్డ అని, తనకు కూమార్తె లాంటిదని తెలిపాడు. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రచారం టీడీపీకి లాభిస్తోందని… ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు.
ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయనకే ఓటర్లంతా మద్దతును ప్రకటించాలని పిలుపునిచ్చిన వేణుమాధవ్, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సెటైర్లు విసిరాడు. ‘నా బిడ్డ అఖిలప్రియపై ఎవరో ఏదో కామెంట్ చేశారట’ అన్న వేణుమాధవ్… ఎవరామె? ఏం చేస్తుంటుంది? అంటూ చుట్టూ ఉన్న అభిమానులను అడిగాడు. దానికి సమాధానంగా అక్కడున్నవారంతా ‘రోజా’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో రోజా అంటే మీకు అర్థం తెలుసా? అంటూ రోజాకు కొత్త నిర్వచనం చెప్పాడు.
‘రోజా’ అంటే ‘రో’ యహాసే ‘జా’ (ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్లు అని తెలుగులో అర్థం) అని తెలిపాడు. టాట్టూలు వేసుకుని, చిన్న చిన్న డ్రస్సులు వేసుకుని, డ్యాన్సులు చేసుకుంటూ ఉండే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని… అలాంటి అసభ్యకరమైన మాటలు తాను మాట్లాడనని విమర్శించాడు. ఆడవాళ్లంటే తనకు ఎంతో గౌరవమని… వారిపై తాను ఎలాంటి విమర్శలు చేయనని, ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వేణుమాధవ్ విన్నవించాడు.
‘గుర్తు తెలియని వారే వారి గుర్తును పట్టుకుని తిరగుతారని… మనకు ఏం అవసరం తమ్మి’ అంటూ… రోడ్ షోలో ఇదే మన గుర్తు అంటూ ఫ్యాన్ ను ఓటర్లకు జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మన గుర్తు మన గుండెల్లోనే ఉందని, గుర్తులు పట్టుకుని తిరగాల్సిన అవసరం మనకు లేదు, టీడీపీ గెలుపు గురించి ఇప్పుడు ఎవరికీ రెండో ఆలోచన లేదని… ఎంత మెజార్టీ అనేదే ప్రామాణికం అని, తాను ప్రచారానికి రాలేదని… టీడీపీకి ఎంత మెజార్టీ వస్తుందో చూద్దామనే వచ్చానని అన్నాడు.
యువకుడు, అందగాడు, బాగా పని చేసే వ్యక్తి భూమా బ్రహ్మానందరెడ్డి అని… కాకపోతే తన కంటే ఒక అడుగు ఎత్తుగా ఉంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని విధంగా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని అక్కా, బావా అంటూ… తెలుగు, హిందీలో వేణుమాధవ్ చేసిన ప్రచారం కార్యకర్తలలో ఉత్సాహాన్ని పంచింది. రీల్ లైఫ్ లో కమెడియన్ అయినా గానీ, రియల్ రాజకీయాలకు వచ్చేసరికి హీరో రేంజ్ లో ప్రసంగాలు ఇవ్వడంలో వేణుమాధవ్ దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు.


