గ్రేటర్ లో ఎవరూ గెలిచినా ఓడిపోయింది మాత్రం ప్రజలే..!

common people in loss whoever wins GHMC electionగ్రేటర్ పరిధిలో ఎన్నికల హడావుడి ముగిసింది. పోలింగ్ పూర్తవ్వడంతో ఇక రాజకీయ పార్టీలు గెలుపోటములకు సంబంధించి సర్వే లెక్కలపై దృష్టి సారించాయి. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన ప్రధాన అంశం ఒకటుంది. అదే పోలింగ్ ఓటింగ్ శాతం. దాదాపు 74 లక్షల మంది ఓటర్లు ఉన్న గ్రేటర్ పరిధిలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అసలే అధికార పార్టీ ఓట్లు గల్లంతు చేసి ఓటర్ల సంఖ్యను 74 లక్షలకే కుదించిందని ప్రత్యర్ధి రాజకీయ పార్టీ ఆరోపణలు చేసిన దృష్ట్యా మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అన్న ప్రశ్నలు భావితరాల ఆలోచనలను ప్రతిబింభిస్తాయి.

సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 43 శాతం పోలింగ్ మాత్రమే జరుగగా, ఈ సంఖ్య పూర్తయ్యే సమయానికి దాదాపుగా 48కి చేరుకోవచ్చని నిజామాబాద్ ఎంపీ కవిత తెలియజేసారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది పోలింగ్ శాతం పెరిగిందని 2009లో 42% నమోదైందని, 2002లో ఇది కేవలం 28 శాతమేనని కవిత వివరించారు. అయితే ఈ పెరుగుదల హర్షించదగ్గ విషయమే అయినా… పట్టణ ప్రాంత ప్రజల మనోభావాలను ఈ ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, నగర రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా డబ్బులు, మద్యం పంపిణీ అవుతుంటుంది. దీనికి గల కారణం ఈ ప్రాంత ప్రజలు వీటికి ఖచ్చితంగా లొంగి పోలింగ్ బూతు దాకా వస్తారు అని! నిజానికి పోలింగ్ పూర్తయిన తర్వాత గణాంకాలకు పరిశీలిస్తే సదరు రాజకీయ నాయకులు వేసిన అంచనాలు తారుమారు కావు. ఇప్పటికీ రూరల్ ప్రాంతాలలోనే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవుతోంది. అది తప్పు అని గ్రేటర్ వాసులు ఏమైనా నిరూపిస్తారేమోనని ఆసక్తిగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురయ్యింది.

నేడు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఓడిపోయింది మాత్రం ప్రజలే..! ప్రజలు వినియోగించుకునే ఒక్క ఓటే దేశ భవిష్యత్తును తిరగరాయగలదు. అలాంటి అవకాశాన్ని దూరం చేసుకోవడం అంటే… పరోక్షంగా రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలకు ప్రజలు కూడా సహకారం అందించినట్లే కదా! ఏ పార్టీకి వేసామన్న దాని కంటే ఓటు హక్కును వినియోగించుకున్నామా లేదా అన్నదే ముఖ్యం. దీనికి గల కారణాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండవచ్చు… ఒకరికి ఉద్యోగం.., మరొకరికి ఆరోగ్యం.., ఇంకొకరికి అత్యవసర పనులు… ఇలా లెక్కకు మించిన కారణాలు ఉండవచ్చు. అయితే ఆ అత్యవసర కారణాల, ఊళ్ళల్లో లేని వారిని 10 శాతంగా (7.4 లక్షల మంది చాలా ఎక్కువేమో… అయినా ఓకే) తీసివేసినా… 90 శాతం పోలింగ్ లో పోలైన ఓట్లు శాతం దాదాపు సగమే.

సంకల్పం ఉంటే పోలింగ్ బూతు దగ్గరికి వెళ్లి ఓటు వేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ మన ప్రజల్లో లేనిదే అది. ఇదే రోజు ఏ పవన్ కళ్యాణ్ సినిమానో, మహేష్ బాబు సినిమానో విడుదలైతే ఉద్యోగాలు నిర్వహించే వారిలో, కాలేజీలకు వెళ్ళే వారిలో సగం మందికి అప్పటికప్పుడు లేదా ముందు రోజు “జ్వరం” వచ్చేస్తుంది… లేదంటే ఇంకొకటి… కారణాలకు కొదవేమి లేదుగా..! ఇలా అభిమానించడం తప్పు కాదు, అయితే దేశ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆలోచించాలి కదా! “నా ఒక్క ఓటే కదా” అని దాదాపు 35 లక్షల మంది ఒకే విధంగా ఆలోచించడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తింది.

ADVERTISEMENT
Latest Stories