2014-19 మధ్య తెలంగాణాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు. తన రాజకీయం ప్రస్థానం మొదలు పెట్టాకా కేవలం రెండు సార్లు మాత్రమే ఓడిపోయిన జానా ఈసారి ఓడిపోయారు. ఎన్నికలలో ఓడిపోయిన నాటి నుండి జానారెడ్డి రాజకీయంగా యాక్టీవ్ గా ఉండటం లేదు. 2014-19 లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అధికార పార్టీతో మెతకవైఖరి అవలంభించారని జానా మీద ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు ఆయన మళ్ళీ వార్తలలో నిలిచారు. హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ నియమితులైన భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయను ఆయన కలిశారు. రామ్ నగర్లోని దత్తాత్రేయ నివాసానికి వెళ్లి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బీజేపీలోకి చేరే సీజన్ నడుస్తుండటంతో ఈ చర్యతో కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టించారు ఆయన. అయితే దీనికి రాజకీయ విశిష్టత ఏమీ లేదని, కేవలం మర్యాదపూర్వకంగానే దత్తాత్రేయని కలిశారని ఆయన అనుయాయులు అంటున్నారు.
ఆయన నిన్న తెలంగాణ గవర్నర్ ఇన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు ట్రాన్సఫర్ అవుతున్న ఈఎస్ఎల్ నరసింహన్ ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఎల్లుండి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లనున్న దత్తాత్రేయ, ఆ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సిమ్లాలో జరుగుతున్నాయి.బండారు దత్తాత్రేయ రేపు హిమాచల్‌ప్రదేశ్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో దత్తాత్రేయకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.





