కెరీర్ తొలినాళ్లలో రణ్ బీర్ కపూర్ – దీపికా పదుకొనేలు గాఢంగా ప్రేమించుకున్న విషయం తెలిసిందే. వీరి బంధం పెళ్లిపీటల వరకు వెళ్తుందని భావించగా, ఏడాది తరువాత బ్రేకప్ అయిపోయింది. దీంతో రణ్ బీర్ తన ప్రేయసిగా కత్రినాను ఎంచుకుంటే… దీపికా తన ప్రియుడిగా రణ్ వీర్ సింగ్ ను ఎంపిక చేసుకుని, ఈ రెండు జంటలు చెట్టాపట్టాలాడాయి. వీరివురి ప్రేమలు కూడా సుదీర్ఘ కాలం నడవడంతో, వీరు ఖచ్చితంగా పెళ్లి పీటలెక్కుతారని భావించారు.
అయితే హాలీవుడ్ లో అరంగేట్రం చేసిన దీపికా పదుకొనే, క్రమంగా విన్ డీజిల్ తో అనుబంధం పెంచుకోవడంతో, రణ్ వీర్ కు ఆమెకు గ్యాప్ పెరిగింది. దీనికి తోడు ఇటీవల హోలీ పండుగ రోజున రణ్ బీర్ కపూర్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, రణ్ వీర్ తో తన బ్రేకప్ విషయాన్ని దీపికా చెప్పకనే చెప్పింది. అంతకు ముందే రణ్ బీర్ పెద్ద తాగుబోతు అంటూ కత్రినా వెల్లడించి, వారిద్దరూ కూడా బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇలా ఒకప్పుడు విడిపోయిన రణ్ బీర్ – దీపికాల ప్రేమ మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయని బాలీవుడ్ వర్గాల టాక్.
ఇందుకు నిదర్శనంగానే ఈ ఫోటోను చూపిస్తున్నారు. తాజాగా దీపికా పదుకొనే మరియు రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ సింగ్ ఓ కార్యక్రమంలో కలవగా, ఈ సందర్భంగా వారు దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనపడుతూ చెవిలో గుసగుసలాడుకోవడంతో, మాజీ ప్రేమికులు మళ్లీ కలిసిపోయారా? రణ్ బీర్ కపూర్ ను దీపిక వివాహం చేసుకోనుందా? అంటూ ట్రేడ్ వర్గాలలో పెద్ద చర్చే నడుస్తోంది. మరి దీనికి సమాధానం లభించాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.



