చిత్రం: దీవానా
M9 రేటింగ్: 2.5 /5
విడుదల తేదీ: జూన్ 20, 2026
తారాగణం: హర్షిత్ రెడ్డి, స్మేహ, నర్సింగ్, టోనీ, నరేష్, ఝాన్సీ తదితరులు
నిర్మాణ సంస్థ: అర్హా మీడియా
దర్శకత్వం: శ్రీకాంత్ సంఘిశెట్టి
సంగీతం: ఈశ్వర్ చంద్
నిర్మాత: వాసుదేవ్ కొప్పినేని – శ్రీదేవి కార్యంపూడి
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
కూర్పు: హృషికేష్ పసపాల్
“మెయిల్, కల్కి, శుభం” వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హర్షిత్ రెడ్డి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం “దీవానా”. శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని వాసుదేవ్-శ్రీదేవి కలిసి నిర్మించారు. యూత్ ఫుల్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ:
డిగ్రీ పాసై ఫ్రెండ్స్ లో జులాయిగా తిరిగే మున్నా (హర్షిత్ రెడ్డి) తొలిచూపులునే అమూల్య (స్మేహ)ను ఇష్టపడతాడు. రోజు ఆమె కోసం ఈ-సేవకి వెళ్లి కూర్చుంటూ ఉంటాడు. అయితే.. రోజూ తనను ఇబ్బందిపెట్టే చాలా మంది అబ్బాయిలకి, నీకు తేడా ఏంటి? అని ప్రశ్నించిన అమ్మాయికి సమాధానం చెప్పడం కోసం గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనుకుంటాడు మున్నా.
ఆ తర్వాత అతడి లైఫ్ లో వచ్చిన ఇబ్బందులేమిటి? మున్నా లవ్ కి ఉన్న ఏకైక ప్రాబ్లెమ్ గవర్నమెంట్ జాబ్ ఒకటేనా? వాటిని మున్నా ఎలా అధిగమించాడు? దానికి అతడి స్నేహితులు ఏ విధంగా సహాయపడ్డారు? అనేది “దీవానా” కథాంశం.
నటీనటుల పనితీరు:
హర్షిత్ రెడ్డి, స్మేహ, నర్సింగ్, టోనీ, నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచు వంటి వాళ్ళందరూ తమ తమ పాత్రలో ఎంత చక్కగా ఒదిగిపోయారంటే.. ఏ ఒక్కరూ నటిస్తున్నారు అనే భావన కలగదు. అందరూ ఎంత ఒద్దికగా జీవిస్తున్నారు అనిపిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులుగా నరేష్-ఝాన్సీ నటన చాలా బాగుంది.
హర్షిత్ రెడ్డి తెలుగు సినిమాలో ఖాళీగా ఉన్న “లవర్ బాయ్” అనే జోన్ ను ఫిల్ చేయగలడు అనిపించింది. చాలా చక్కగా నటించాడు. ఎమోషన్స్ అతడి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
స్మేహకి ఇది మొదటి సినిమా అంటే నమ్మడం కష్టం. అంత నేచురల్ గా కనిపించింది. పాత్రలో జీవించింది కూడా. స్నేహితులుగా నటించిన నర్సింగ్ & టోనీ పెర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా నర్సింగ్ కి ఇచ్చిన ర్యాప్ సాంగ్ ఎలివేషన్ అదిరింది. కీ సీక్వెన్స్ లో టోనీ కూడా అదరగొట్టాడు.
రఘు కారుమంచు కనిపించేది రెండు మూడు సన్నివేశాల్లోనే అయినప్పటికీ.. తండ్రి కష్టం గురించి, తల్లిదండ్రుల గొప్పదనం గురించి చెప్పే ఒక్క సీన్ లో ఎంత మంచి నటుడు రఘు అనిపించుకున్నాడు.
జీవన్ కి మళ్లీ మంచి హైద్రాబాదీ భాయ్ క్యారెక్టర్ దొరకడంతో.. హ్యాపీగా కంఫర్ట్ జోన్ లో కనిపించాడు.
సాంకేతికవర్గం పనితీరు:
ఈశ్వర్ చంద్ పాటలు సినిమాకి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాయి. “ఇది ప్రేమ, తెల్ల పోరి” లాంటి పాటలు కొత్తగా ఉన్నాయి. ర్యాప్ సాంగ్స్ బాగున్నాయి. అయితే.. సెకండాఫ్ లో వచ్చే తర్ఫీద్ 2010లో వచ్చిన బెంగాలీ సినిమా “గాండు” ర్యాప్ ని గుర్తు చేస్తే.. ఇంటర్వెల్ బ్యాంగ్ బీజీయం “సీతారామం”ను గుర్తు చేస్తుంది.
సినిమాటోగ్రఫీ వర్క్ ఆర్గానిక్ గా ఉంది. మణికొండ, బోరబండ, చిక్కడపల్లి లాంటి లైవ్ లొకేషన్స్ లో షూట్ చేసారు. అందువల్ల సినిమా మొత్తం చాలా సహజంగా కనిపించింది. హీరో & ఫ్రెండ్స్ ఉండే ఏరియా కూడా చాలా బాగా వాళ్ళ రిలేషన్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి దోహదపడింది. ఆర్ట్ & కాస్ట్యూమ్ డిపార్టమెంట్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు.
దర్శకుడు శ్రీకాంత్ ఒక సింపుల్ లవ్ స్టోరీకి చిన్న ట్విస్ట్ యాడ్ చేసి.. దాని చుట్టూ కథను అల్లుకున్న విధానం బాగుంది. ఏ ఒక్క పాత్ర స్క్రీన్ నింపడం కోసం అన్నట్లుగా కాకుండా.. కథలో, కథనంలో భాగస్వాములుగా ఉండేలా చూసుకోవడం అనేది ప్రశంసార్హం. బంధాలను కూడా చాలా చక్కగా ప్రెజంట్ చేశాడు. స్నేహితుల మధ్య ఉండే బాండిగ్ కావచ్చు, తలిదండ్రుల నడుమ ఉండే బాంధవ్యం కావచ్చు.. చాలా రిలేటబుల్ గా ఉంటాయి. హీరోహీరోయిన్ల నడుమ వచ్చే సన్నివేశాలు కూడా ఫ్రెష్ గా ఉన్నాయి. ప్రేమ ఎలా పడుతుంది అనేకంటే.. అది జీవితాంతం ఉండాలంటే మనుషులు వారి మనసులో భావాలు ఎలా ఉండాలి రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశాడు శ్రీకాంత్. క్లైమాక్స్ ఒక్కటే అనవసరంగా సాగదీశాడు అనే భావన కలుగుతుంది కానీ.. థియేటర్ల నుండి మాత్రం ఒక మంచి సినిమా, ఒక కొత్త సినిమా, ఒక ప్రొపర్ హైద్రాబాదీ సినిమా చూశామనే భావనతో బయటికి వెళ్తారు ప్రేక్షకులు. సో, ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ గా ప్రేక్షకుల్ని అలరించడంలో శ్రీకాంత్ సక్సెస్ కొట్టాడనే చెప్పొచ్చు.
విశ్లేషణ:
తెలంగాణ నేపథ్యంలో ఒక సింపుల్ మరియు స్వచ్ఛమైన లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులవుతుంది. ఆ వెలితి తీర్చిన చిత్రం “దీవానా”. టేకింగ్, మేకింగ్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, కెమెరా వర్క్, ఎడిటింగ్.. ఇలా టీమ్ అంతా తమ బెస్ట్ ఇచ్చిన ఈ సినిమాలో అన్నీ ఎమోషన్స్ చక్కగా పండాయి. అయితే.. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సినిమా స్లో అవుతుంది, కొన్ని సీన్స్ తర్వాత ప్రెడిక్టబుల్ అయిపోతుంది కూడా. క్లైమాక్స్ ఏంటి అనేది ఆల్మోస్ట్ జనాలు గెస్ చేస్తారు. డైరెక్టర్ కూడా ఆ క్లైమాక్స్ లో మరీ ఎక్కువ మెలోడ్రామా పండించాలని ప్రయత్నించాడు. అందువల్ల.. స్వీట్ & సింపుల్ గా ముగియాల్సిన సినిమా, కాసేపు సాగి ఎమోషన్ ను డైల్యూట్ చేసింది. అయితే.. యూత్ ఆడియన్స్ ని నచ్చే ఫ్రెండ్ షిప్, లవ్ & హ్యూమర్ వంటివన్నీ పుష్కలంగా ఉన్న ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్మెంట్ అవసరం. ఆడియన్స్ ఈ సినిమాని ఓటీటీలో కంటే ముందే థియేటర్లో గుర్తిస్తే.. శ్రీకాంత్ లాంటి హానెస్ట్ ఫిలిం మేకర్స్ మరింత మంది ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంటుంది. సెకండాఫ్ & క్లైమాక్స్ లో వచ్చే ల్యాగ్ ని ఇగ్నోర్ చేయగలిగితే.. “దీవానా” ఒక ఫ్రెష్ ఫిలిం చూశామనే ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
ఓవరాల్ గా.. సింపుల్ & రిలేటబుల్ హైద్రాబాదీ లవ్ స్టోరీ!
M9 రేటింగ్: 2.5/5




