వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఈడీ నుండి పిలుపు వచ్చింది. గురువారం నాడు ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణ నిమిత్తం హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. దీంతో ఆడిటర్ విజయసాయిరెడ్డితో సహా జగన్ గురువారం ఉదయం ఢిల్లీలో ప్రత్యక్షం కాబోతున్నారని సమాచారం. అయితే ఈ ఉదంతం పై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
విచారణలో సరైన సమాచారం ఇవ్వని పక్షంలో జగన్ ను అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు అన్న సమాచారంతో వైసీపీ వర్గాలలో ఓ విధమైన భయాందోళన వాతావరణం నెలకొంది. గతంలో జార్ఖండ్ సిఎం మధుకోడా విషయంలోనే కఠినంగా వ్యవహరించిన ఈడీ, జగన్ సమాధానాలకు సంతృప్తి చెందని పక్షంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో అన్న భావన రాజకీయ వర్గాల్లోనూ కలుగుతోంది.
తాజా పరిణామాలతో జగన్ కూడా ఒకింత ఆందోళనకు గురయ్యే అవకాశం లేకపోలేదని మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో గురువారం ఎలా గడుస్తుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ కలుగుతోంది.





