కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఢిల్లీ పోలీసులు కేంద్రం అజమాయిషీ కింద పని చేయరాదని ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ బి.డి.అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ, పోలీసు శాఖలో అదనపు పోస్టులను సృష్టించనందుకు కేంద్రాన్ని దుయ్యబట్టింది. హోం మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇచ్చినా ఈ శాఖలో నియామకాలకు సంబంధించి నిధులను విడుదల చేయకపోవడంపై ఆర్ధిక శాఖను కూడా కోర్టు తప్పు పట్టింది.
“కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా స్వతంత్రులుగా పని చేయండి, ఇదే మీ లక్ష్యం కావాలి” అని ఢిల్లీ పోలీసులకు హైకోర్ట్ న్యాయమూర్తులు సూచించారు. దేశ రాజధానిలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని కోర్టు కూడా అభిప్రాయపడింది. రాత్రి 7 గంటల తర్వాత మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదని, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి వారి భద్రత కోసం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.





