భారీ అంచనాలు ఉన్న సినిమా అందులోనూ గట్టి అపోజిషన్ ఉన్నప్పుడు ప్రమోషన్ విషయంలో చాలా ఆచి తూచి అడుగులు వేయాలి. అసలే సోషల్ మీడియాలో కాలంలో అభిమానులు మేం గొప్పంటే మేం గొప్పని ట్విట్టర్ యుద్ధాలు చేసుకుంటున్న ట్రెండ్ లో వాటిని హీరోలు పట్టించుకోకపోయినా ఆ పరిణామాల ప్రభావాన్ని మాత్రం అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. వాల్తేర్ వీరయ్య బాస్ పార్టీ ప్రోమో వచ్చినప్పుడు డిఎస్పి ట్యూన్ మీద ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. తీరా చూస్తే ఫుల్ సాంగ్ వచ్చాక సీన్ మారిపోయింది. ఇప్పుడూ గొప్పగా ఉందని చెప్పలేకపోయినా ట్యూన్ లో ఉన్న క్యాచీనెస్ వినగా వినగా దాన్ని చివరికి సక్సెస్ ట్రాక్ మీదకు ఎక్కించేసింది.
అప్పటి నుంచి వీరసింహారెడ్డిలో ఫస్ట్ ఆడియో సింగల్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు. చెప్పిన టైంకే జై బాలయ్య ట్రాక్ యుట్యూబ్ లో వచ్చేసింది. అభిమానులకు నచ్చడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు కానీ ఓపెన్ గా మాట్లాడుకుంటే తమన్ ఆశించిన స్థాయిలో ఈ సాంగ్ ఇవ్వలేకపోయాడన్నది వాస్తవం. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటే కావొచ్చు. అలాంటప్పుడు దీనికన్నా బాగున్నది, వెంటనే మాస్ కి ఎక్కేసేది ముందు ప్లాన్ చేసుకోవాలి కానీ ఇలా అవుట్ డేటెడ్ అనిపించే రెగ్యులర్ కంపోజింగ్ తో కాదు. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ ఒంటి తీరు అంటూ హీరో లక్షణాలను రామజోగయ్య శాస్త్రి వర్ణించిన తీరూ పాత కాలం నాటిదే.
ఇదంతా ఒక ఎత్తు అయితే జై బాలయ్యకు ముందు వచ్చే రిథమ్, ఆ పదాలను పలికించిన తీరు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన ఒసేయ్ రాములమ్మా తరహాలో ఉండటం ట్రోలింగ్ కి ఛాన్స్ ఇచ్చింది. ఇంకేముంది యాంటీ ఫ్యాన్స్ పోలికలతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అవి ఎంత కన్విన్సింగ్ గా ఉన్నాయంటే అంత తేలిగ్గా కొట్టి పారేయలేనంత. ఇదే తమన్ అఖండలో జైబాలయ్యతో కంపోజ్ చేసిన డ్యూయెట్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటప్పుడు అంతకు మించి ఆశించడంలో తప్పు లేదుగా. విజువల్స్, బాలయ్య డాన్సు, షాట్స్ అన్నీ బాగున్నాయి కానీ అసలు చిక్కంతా పాటతోనే వచ్చింది
ఇలాంటివి ఎదురుకోవడం తమన్ కూ అలవాటే కానీ దేవిలాగా అవుట్ ఫుట్ తో సమాధానం ఇవ్వలేదనే అనిపిస్తుంది. ముందు ముందు స్లో పాయిజన్ లాగా ఏదైనా కనెక్ట్ అవుతుందేమో చూడాలి. ఒక్కోసారి హైప్ ఎక్కువగా ఉండటం కూడా బరువే. ఇప్పుడీ వీరసింహారెడ్డి సాంగ్ విషయంలో అది కనిపిస్తోంది. వాల్తేర్ వీరయ్య తో పోలిక సమంజసం కాదని కొందరు అనవచ్చు. రెండింటి సందర్భాలు నేపధ్యాలు వేరే అని. అది నిజమే కానీ పబ్లిసిటీలో చాలా కీలకమైన మొదటి అడుగు కాబట్టి ఎవరు వద్దన్నా చిరు బాలయ్య అభిమానులు కంపేర్ చేసుకోకుండా ఉండలేరు. జై బాలయ్య లాంటి పవర్ ఫుల్ సౌండ్ ని రెండోసారి తమన్ సరిగా ఉపయోగించుకోలేదేమో



