దేవినేని వర్సెస్ హరీష్… కులాలు కాదు జలాలు..!

Devineni-Uma-  Harish-Raoఏపీలో ఏ ఇద్దరినీ కదిపినా ప్రస్తుతం కులాల గురించే చర్చంతా! అయితే ప్రజల దృష్టిని కులాల నుండి జలాల వైపుకు మరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కృష్ణానది నీటి పంపకాల అంశంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖా మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, హరీశ్ రావులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని దేవినేని ఉమా ఆరోపిస్తుండగా, ఏపీనే వితండ వాదన వినిపిస్తోందని హరీష్ రావు ఆరోపిస్తున్నారు.

విభజన తాము కోరుకున్నది కాదని, రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితులు తలెత్తాయని, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 500 కోట్ల విలువైన పంటను కాపాడుకోగలిగామని దేవినేని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే రెండు రాష్ట్రాలకు నీటి పంపకాలు చేపట్టాలని మాత్రమే తాము కోరుతున్నామని దేవినేని స్పష్టం చేసారు. ఇదే విషయమై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కృష్ణానది నీటి పంపకాల అంశంలో ఏపీ వితండవాదం చేస్తోందని… నాగార్జున సాగర్ కుడి కాలువను తమకే అప్పగించాలని ఏపీ కోరడం సరికాదని, ఒకే ప్రాజెక్టును రెండు రాష్ట్రాలు నిర్వహించుకోవడం దేశంలో ఎక్కడా లేదన్నారు.

ADVERTISEMENT

పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించే నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరితే ఏపీ పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లుంటున్నాయని, తెలంగాణలో మాత్రం ఒక పంటకు కూడా నీరు ఉండకూడదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. గోదావరి నీటి లభ్యతపై స్వతంత్ర కమిటీ వేసి తెలంగాణకు అందులో భాగస్వామ్యం కల్పించాలని హరీష్ రావు చేసిన డిమాండ్ పై ఏపీ నేత ఉమా మండిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories