కౌరవుడు సినిమాలో అంతా నా ఇష్టం అనే పాట వినే ఉంటారు. దిల్ రాజు వ్యవహారం అచ్చం ఇలాగే ఉందని పరిశ్రమలో ఓపెన్ టాక్. థియేటర్లు నావి బిజినెస్ నాది ఎవరి స్థాయికి వాళ్ళు చేసుకోండి అంతే తప్ప నా మీద పడతారెందుకు అని చెప్పిన కొద్దిరోజులకే కొత్త రిలీజుల విషయంలో కొత్త మంకుపట్టు చూపిస్తున్నారు. తాజాగా ఎస్విసి బ్యానర్ లో రూపొందిన సమంతా శాకుంతలంని ఫిబ్రవరి 17 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గుణశేఖర్ క్రియేటివ్ వర్క్స్ భాగస్వామ్యంలో ఆయన దర్శకత్వంలోనే ఇది రూపొందుతోంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం పట్టింది.
సరే రిలీజ్ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఒక అగ్ర నిర్మాతగా ఇతర ప్రొడ్యూసర్ల గురించి కూడా కొంతయినా ఆలోచిస్తున్నారానేది ఇక్కడ మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే ఆ డేట్ ని విశ్వక్ సేన్ ధమ్కీ కోసం ఎప్పుడో లాక్ చేసి బాలకృష్ణ చేతుల మీద టీజర్ లాంచ్ చేసి మరీ కొద్దివారాల క్రితం ప్రకటించారు. అంతకన్నా ముందే సితార సంస్థ ధనుష్ తో తీస్తున్న బై లింగ్వల్ సర్ కూడా 17కే రావాలని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 వినరో భాగ్యము విష్ణుకథ ఫస్ట్ కర్చీఫ్ వేసింది.
ఇవన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని టార్గెట్ చేసుకుని ప్లాన్ చేసుకున్నవి. ఆ నెలలో వచ్చేది ఈ ఒక్క పండగే. మిగిలిన రోజులు డ్రై గా ఉంటాయి. అందుకే ఈ టైంలో పెద్దగా రిస్క్ చేయరు. ఆల్రెడీ మూడు మీడియం రేంజ్ సినిమాలు రేస్ లో ఉన్నప్పుడు హఠాత్తుగా నాలుగో దాన్ని అది కూడా మార్కెట్ పరంగా ఇమేజ్ ఉన్న సమంతా, గుణశేఖర్ లాంటి కాంబోని దింపడం వల్ల ఇప్పుడు సంక్రాంతికి ఏదైతే సమస్య వస్తోందో ఖచ్చితంగా అప్పుడూ రిపీట్ అవుతుంది. వారసుడునే డబ్బింగ్ కాదని దబాయిస్తున్న దిల్ రాజు ఇక శాకుంతలం విషయంలో ఎవరి మాటైనా ఎందుకు వింటారు.
టాలీవుడ్ నిర్మాతల మండలి ఎంత నామమాత్రపు పాత్ర పోషిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే సంక్రాంతి అంటే ఏడాది మొత్తంలో ఒకటే కీలక సీజన్ కాబట్టి ఒకటి రెండు ఎక్కువున్నా ఏదోలే అనుకోవచ్చు. కానీ శివరాత్రికి మళ్ళీ అదే ధోరణి చూపించడం సరికాదనేది పెద్దలు సైతం అభిప్రాయపడుతున్నారు. వారసుడు నేను ముందు అనౌన్స్ చేశానని సమర్ధించుకున్న దిల్ రాజు ఇప్పుడు చివర్లో శాకుంతలం అనౌన్స్ మెంట్ ఇచ్చారు కాబట్టి థియేటర్ల త్యాగానికి సిద్ధపడతారా. ఒక్క శాతం అవకాశం కూడా ఉండదు. నన్ను రెచ్చగొట్టారు కదా చూడండి నా సత్తా అనేలా సామ్ సినిమాని హఠాత్తుగా తీసుకొచ్చారనే కామెంట్ బలంగా వినిపిస్తోంది.



