ఈ నెల 18వ తేదీన దసరా పర్వదినం సందర్భంగా విడుదల కాబోతోన్న “హలో గురు ప్రేమ కోసమే” సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఉత్సాహభరితంగా జరిగింది. త్రినాధరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ – అనుపమ జంటగా నటించగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజే హైలైట్ గా నిలవడం విశేషం.
[m9ad]
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో కలిసి స్టెప్పులేసిన దిల్ రాజు ఈవెంట్ ను మొత్తం తన వైపుకు తిప్పుకున్నాడు. ఎంతో హుషారుగా కనిపించిన దిల్ రాజు, ఈ సినిమా ఆద్యంతం కూడా అంతే హుషారుగా ఉంటుందని స్పష్టం చేసారు. 2.15 గంటల నిడివి గల సినిమాలో 1.15 నిడివి గల సినిమా ప్రేక్షకులందరినీ నవ్విస్తుందని, ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ సబ్జెక్ట్ ను ముందుగా విన్న తాను, దీనిని పక్కనపెట్టి మరో స్టోరీతో ముందుకెళ్లామని, కానీ ప్రకాష్ రాజ్ విన్న తర్వాత తనకు ఫోన్ చేసి చర్చించగా, ఆ తర్వాత రామ్ విని…. అలా పట్టాలెక్కిన ఈ మూవీ ‘ఫుల్ ఎంటర్టైనర్’ రూపుదిద్దుకుందని తెలిపారు. దిల్ రాజు ఉత్సాహం, ఉల్లాసం చూస్తుంటే ‘హలో గురు ప్రేమ కోసమే’తో మరో కమర్షియల్ సక్సెస్ అందుకోవడం ఖాయంగా కనపడుతోంది.



