‘అలా మొదలైంది’ సినిమాతో అనూహ్యమైన విజయాన్ని చవిచూసినప్పటికీ, ‘జబర్దస్త్’ అట్టర్ ఫ్లాప్ తర్వాత అవకాశాలు కనుమరుగైన నందిని రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా “కళ్యాణ వైభోగమే” సినిమా మార్చి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రోజులు దగ్గర పడుతుండడంతో సినిమా పబ్లిసిటీ ఊపందుకుంది. ఆ క్రమంలోనే పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది నందిని. “సినిమా ఓపెనింగ్స్ కు కారణం దర్శకులు కాదు, హీరోలు మాత్రమే” అని చెప్పింది.
‘ఒక దర్శకుడు సినిమాను ఎంత బాగా రూపొందించినా, ప్రేక్షకులు తొలి రోజు సినిమాకు వచ్చేది మాత్రం హీరో ముఖం చూసని, అయితే అభిమానులు సినిమా బాగుందని చెప్పినా, కథ లేకపోతే దానిని ఆదరించరని, ఇమేజ్ ఉన్న హీరోకు మంచి కథ దొరికితే అది అంబరాన్ని తాకేలా సినీ ప్రేక్షకులు ఆదరిస్తారని’ అభిప్రాయపడ్డారు. “ఈ సినిమాను ఆహ్లాదకర వాతావరణంలో అద్భుతమైన కథతో రూపొందించానని, ‘అలా మొదలైంది’ సినిమా కంటే ముందే ఈ కథను రాసుకున్నానని చెప్పిన నందిని రెడ్డి, చిన్నప్పుడు ఏదో పెళ్లికి వెళ్లి ఉంటానని, ఆ జ్ఞాపకాల వల్లే తన సినిమాలన్నీ పెళ్లి కథల చుట్టూ తిరుగుతున్నానని” చమత్కరించింది ఈ లేడీ డైరెక్టర్.
తాను పెద్ద హీరో కోసం ఎదురుచూస్తున్న దశలో కొంత మంది సన్నిహితులు, ‘నువ్వేంటి, కొత్తగా హీరోల వెంటపడుతున్నావు? అంటూ అడిగారని, అందుకే ఈ కళ్యాణ వైభోగమే కథను తయారు చేసుకున్నానని, కథానుసారం నాగశౌర్యను ఈ సినిమాలో ప్రధాన పాత్రకు ఎంపిక చేయడం జరగిందని, సినిమా విజయంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు నందిని రెడ్డి.



