ఎంత గొప్ప దర్శకుడైనా అతని పేరు ప్రతిష్టలు కేవలం సినిమాల సక్సెస్ ల మీద మాత్రమే ఆధారపడవు. వివాద రహిత వ్యక్తిత్వంతో పాటు సమాజానికి ఏం చేసినా చేయకపోయినా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదనే మచ్చ రాకుండా చూసుకోవడం చాలా అవసరం. ఒకప్పుడు టాడా కేసులో జైలుకెళ్ళొచ్చిన సంజయ్ దత్ కు ఆ మరక పోవడానికి దశాబ్దాలు పట్టింది. అంతా అయిపోయాక విలన్ వేషాలతో కెరీర్ ని కొనసాగించాల్సిన పరిస్థితి. ఇది అందరికీ వర్తిస్తుంది. పూరి జగన్నాథ్ ఉదంతం ఈ ఉదాహరణను కొత్త లెవెల్ కు తీసుకెళ్లింది
తాజాగా పూరి ఛార్మీలు ఈడి నుంచి 15 రోజుల క్రితమే సమన్లు అందుకుని ఇవాళ వాళ్ళ ఆఫీస్ కు హాజరయ్యారు. ఫెమా(ఫారిన్ ఎక్స్చేంజ్ మానేజ్మెంట్ యాక్ట్) కింద లైగర్ సినిమాకు సంబంధించిన పెట్టుబడుల గురించి ఉదయం నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు.. అనధికార విదేశీ పెట్టుబడులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా అమలు చేసే చట్టమిది. అందులో చిక్కుకోవడమంటే చిన్న విషయం కాదు. విషయం అంతు తేలే వరకు విడిచిపెట్టడం ఉండదు. ఏదైనా చిన్న క్లూ దొరికిందా డొంక కదిలే దాకా చాలా దూరం లాగేస్తారు.
ఇటీవలే లైగర్ తాలూకు నష్టాల గురించే డిస్ట్రిబ్యూటర్ల మీద పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో పాటు తన ఇంటికి సెక్యూరిటీ ఇప్పించుకున్న పూరి ఆల్రెడీ ట్రేడ్ లో పూర్తి బ్యాడ్ అయిపోయాడు. నష్టాల గురించి ప్రశ్నిస్తే ఇలా రివర్స్ లో తమ మీద ఫిర్యాదు చేయడం పట్ల బయ్యర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అది గుట్టుగా పరిష్కరించుకుని ఉంటే సరిపోయేది. వీధికెక్కడం ద్వారా సదరు పంపిణీదారులకు పోయింది మహా అయితే డబ్బే కానీ పూరి అంతకు మించి ఎన్నో రెట్లు ఎక్కువ పేరు ప్రతిష్ఠలు పోగొట్టుకున్నాడు.
ఇదంతా సెల్ఫ్ గోలే. ప్యాడ్ క్యాస్ట్ లో వేదాంతాలు, వ్యక్తిత్వ పాఠాలు చెప్పినంత తేలిక కాదు వాటిని నిజ జీవితంలో పాటించడం అనే దానికి పూరినే నిదర్శనంగా నిలవడం అసలు ట్విస్టు. చానళ్ల క్రితం డ్రగ్స్ కేసులో ఇదే తరహా వివాదంలో చిక్కుకుని బయటపడిన పూరికి ఇప్పుడిది మెడకు గట్టిగానే చుట్టుకునేలా ఉంది. ఫెమా అంటే ఏదో ఆషామాషీ పెట్టి కేసు కాదు. అన్ని కోణాల్లో చెక్ చేసుకునే నోటీసులు పంపిస్తారు. అందులోనూ సెలబ్రిటీలంటే ఊరికే రాళ్ళేయడం లాంటివి ఉండవు.
ఒకప్పడు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోలు తన కోసం వేచి చూసేలా వెలిగిన పూరిని ఇంత పతన స్థాయిలో చూడటం అభిమానులను కలవరపరిచేదే. నిప్పు లేనిదే పొగరాదు. లైగర్ పెట్టుబడుల గురించి ఒక్కొక్కటిగా చీకటి కోణాలు బయటికి వస్తున్నాయి. మరి పూరి ఇందులో నుంచి క్షేమంగా బయటపడతాడా చూడాలి. ఫ్యాన్స్ కోరుకుంటున్నది అదే. నేనింతే క్లైమాక్స్ లో రవితేజ చెప్పినట్టు హిట్టయినా ఫ్లాప్ అయినా మన ప్రపంచం సినిమా. కానీ పూరి దాన్నుంచి ఎప్పుడో బయటికి రావడం వల్లే ఈ పతనం.



