2016 సంక్రాంతి పండుగ సినీప్రియుల ఆకలి తీర్చిందని చెప్పవచ్చు. ప్రేమికుల కోసం “నేను.. శైలజ…,” కుటుంబ తరహా వర్గానికి “సోగ్గాడే చిన్నినాయనా,” కొత్తదనం కోరుకునే వారికి “నాన్నకు ప్రేమతో,” మాస్ విభాగానికి “డిక్టేటర్,” క్రైమ్ లవర్స్ కు “ఎక్స్ ప్రెస్ రాజా” సినిమాలు విడుదలై ప్రేక్షకులకు కన్నుల పండుగగా నిలిచాయి. ఈ నాలుగు సినిమాలకు కూడా ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టి, 2016 సంవత్సరాన్ని ఘనంగా ఆరభించారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది.
అయితే బరిలో నిలిచిన మూడు పెద్ద సినిమాలలో సంక్రాంతి ‘విజేత’ ఎవరు? అన్న అంశం అభిమాన వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. ఏ హీరో అభిమాని మా హీరో సినిమానే అసలు “విజేత” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. మూసలో సాగిపోతున్న తెలుగు సినిమా రూపురేఖలను మార్చడానికి వచ్చిన సినిమాగా “నాన్నకు ప్రేమతో” సినిమాను కొనియాడుతూ, ఓవర్సీస్ లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ను జూనియర్ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు.
రొటీన్ సినిమా అయినా అభిమానులను, సినీ ప్రేక్షకులను “డిక్టేటర్” విశేషంగా అలరిస్తోందని, రానూ రానూ ఈ సినిమా టాక్ మరింత పాజిటివ్ గా మారుతోందని, ఈ సంక్రాంతికి అసలు విజేత “డిక్టేటర్” అని నందమూరి అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక, అక్కినేని అభిమానుల హడావుడి కూడా తక్కువేమీ లేదు. మిక్స్ డ్ రిపోర్ట్స్ వచ్చిన సినిమాలే ‘సూపర్ హిట్’ అని ప్రచారం చేసుకుంటే, తొలి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న “సోగ్గాడే చిన్నినాయనా” సినిమానే 2016 సంక్రాంతి ‘విజేత,’ ఈ ఏడాది ఫస్ట్ ‘బ్లాక్ బస్టర్’ అని విస్తృతంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఇలా వాదోపవాదాల నడుమ సంక్రాంతి సినిమాలు ధియేటర్లలో ప్రదర్శితమవుతున్నాయి. కలెక్షన్స్ రీత్యా “నాన్నకు ప్రేమతో” సినిమా ముందు వరుసలో ఉంటే, టాక్ పరంగా “సోగ్గాడే చిన్నినాయనా” టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే జూనియర్ సినిమాకు ఖర్చు పెట్టిన దాదాపు 55 కోట్లల్లో ప్రస్తుతానికి షుమారు 40 కోట్లు వసూలు కాగా, నాగార్జున సినిమాకు పెట్టిన బడ్జెట్ 20 కోట్లల్లో 90 శాతం రెవిన్యూను ఇప్పటికే రాబట్టడంతో… ఈ ఏటి మేటి సంక్రాంతి విజేత “సోగ్గాడే చిన్నినాయనా” అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
‘ప్రాఫిట్ & లాస్’ సిద్ధాంతం ప్రకారమే కాదు, అభినయం విషయంలోనూ నాలుగు సినిమాల్లోని ప్రధాన పాత్రల అభినయాలను పరిశీలిస్తే… “బంగార్రాజు” అందరి కంటే ముందు వరుసలో ఉన్నారు. “నాన్నకు ప్రేమతో” సినిమాలో అభిరాం పాత్రలో అద్భుతంగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ పాత్రను మరో హీరో చేసేయవచ్చు. నిజానికి చాలా సందర్భాలలో జూనియర్ నటన ‘సెటిల్డ్’ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన మహేష్ ను గుర్తుకు తెస్తూ ఉంటుందని సినీ విమర్శకులు ఇప్పటికే తేల్చిన విషయం.
అలాగే “డిక్టేటర్”లో బాలకృష్ణ పాత్రలో ఏ మాస్ హీరోనైనా ఊహించుకోవచ్చు. కానీ, “సోగ్గాడే చిన్నినాయనా”లో ‘బంగార్రాజు’ పాత్రలో మరొకరిని ఊహించుకోలేమని, బహుశా ‘మన్మధుడు’గా కొనియాడే నాగార్జున కోసమే ఆ పాత్ర పుట్టిందేమో అనే విధంగా ‘బంగార్రాజు’ పాత్రలో నాగ్ ఇరగ్గొట్టేసారని సినీ విమర్శకులు నాగ్ నటనకు కితాభిస్తున్నారు. దీంతో ఏ రకంగా చూసినా “సోగ్గాడు” మిగతా చిత్రాలపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇంకా సంక్రాంతి ‘విజేత’ను డిక్లేర్ చేయాలంటారా..!





