ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ‘ఫ్రీడం 251’ స్మార్ట్ ఫోన్ బుకింగ్స్ పై టెక్ ప్రియులు మండిపడుతున్నారు. ఉదయం 6 గంటలకు బుకింగ్స్ అని ప్రకటన చేయడంతో, సదరు మొబైల్ ధరకు దక్కిన ప్రాధాన్యత రీత్యా చాలా మంది ఈ టైం కోసం నిరీక్షించారు. అయితే తాకిడి ఎక్కువ కావడంతో వెబ్ సైట్ క్రాష్ అయ్యి, అసలుకే మోసం వచ్చింది.
దీనిపై తాజాగా సదరు కంపెనీ కూడా వివరణ ఇచ్చుకుంది. సెకన్ కు 6 లక్షల మంది బుకింగ్స్ కోసం ప్రయత్నించడంతో సాంకేతిక లోపాలు తలెత్తాయని, మరో 24 గంటల్లో అందుబాటులోకి తీసుకువస్తామని, జరిగిన లోపానికి చింతిస్తున్నామని తెలిపింది.
ఇదిలా ఉంటే, కొందరికి బుకింగ్స్ అవ్వడంతో సదరు సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే అసలు విషయమేమిటంటే… ఈ బుకింగ్స్ లో చాలా బొక్కలున్నాయని తేలింది. బుకింగ్ కాలమ్ లో ‘-9’ లేక ‘0.5’ సంఖ్య పెట్టినా కూడా బుకింగ్ తీసుకోవడం పట్ల నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అంటే మొబైల్ ను సగం విరిచి ఇస్తారేమోనని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, అసలు ఇదొక పెద్ద స్కాంగా వాట్సప్, ట్విట్టర్ లలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.



